నిఖిల్ సిద్ధార్థ్ స్వయంబు మూవీ లాంచ్: నేటి నుండే షూటింగ్ మొదలు
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం అందుకున్న నిఖిల్, ఇటీవల స్పై సినిమాతో వచ్చి ఆశించినంత సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం స్వయంబు టైటిల్ తో కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా ప్రకటన గతంలోనే వచ్చింది. తాజాగా ఈరోజు స్వయంబు మూవీ లాంచింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇండస్ట్రీకి సంబంధించిన అతిథుల మధ్య శ్రావణ శుక్రవారం రోజున స్వయంబు మూవీని లాంచ్ చేసారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విరూపాక్ష, సార్ సినిమాల్లో నటించిన సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. లాంచింగ్ సందర్భంగా స్వయంబు నుండి పోస్టర్ రిలీజ్ చేసారు.
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అందిస్తున్న స్వరాలు
లాంచింగ్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకు ముందెప్పుడూ చూడని నిఖిల్ ని స్వయంబు సినిమాలో చూడబోతున్నామని అర్థమవుతోంది. స్వయంబు సినిమా కెమెరా బాధ్యతలను మనోజ్ పరమహంస నిర్వర్తిస్తున్నారు. కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంకా వాసుదేవ్ మునప్పగారి మాటలు రాస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.