నిత్యామీనన్ బర్త్ డే: జర్నలిస్ట్ కావాలనుకుని హీరోయిన్ గా మారిన నిత్యా..ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు
నిత్యా మీనన్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్యమూరి.. ఇలా చాలా సినిమాల్లో కనిపించింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల చిత్రాల్లో నటించింది నిత్యా మీనన్. ప్రస్తుతం నిత్యామీనన్ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలేంటో చూద్దాం. ఏప్రిల్ 8వ తేదీన మళయాలీ దంపతులకు బెంగళూరులో జన్మించింది నిత్యా. అయితే ఆమెకు మళయాలం చదవడం, రాయడం రాదు. నిత్యామీనన్ నిజానికి యాక్ట్రెస్ అవ్వాలని అనుకోలేదు. జర్నలిస్టు కావాలని అనుకుంది. కానీ సడెన్ గా సినిమాల్లోకి వచ్చేసింది. పదేళ్ళ వయసులో మొదటిసారి వెండితెర మీద కనిపించింది నిత్య. హీరోయిన్ టబుకు చిన్న చెల్లెలిగా హనుమాన్ చిత్రంలో కనిపించింది.
మళయాలం సినిమాతో హీరోయిన్ గా మారిన నిత్యా మీనన్
2007లో రిలీజైన కన్నడ చిత్రం సెవెన్ ఓ క్లాక్ సినిమాలో సపోర్టింగ్ పాత్రలో మెరిసింది నిత్యా. 20ఏళ్ళ వయసులో ఆకాశ గోపురం అనే మళయాలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా ఇదే మొదటి చిత్రం. 2011లో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది. అదే సంవత్సరం తమిళంలో 180 సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. 2019లో వచ్చిన మిషన్ మంగళ్ సినిమాతో బాలీవుడ్ లో కాలు మోపింది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, విద్యా బాలన్, తాప్సీ నటించారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. బ్రీత్ ఇన్ టు ద షాడోస్ సిరీస్ 2, 3 సీజన్లలో నిత్యా మీనన్ కనిపించింది.