LOADING...
Tollywood: స్టార్ సపోర్ట్ లేదు.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే స్టార్‌గా ఎదిగిన యువ హీరోలు
స్టార్ సపోర్ట్ లేదు.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే స్టార్‌గా ఎదిగిన యువ హీరోలు

Tollywood: స్టార్ సపోర్ట్ లేదు.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే స్టార్‌గా ఎదిగిన యువ హీరోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా ప్రపంచం అంటే గ్లామర్‌, పేరు, డబ్బు. కానీ ఈ రంగుల లోకంలో అడుగుపెట్టడం ఒక సవాలైతే, నిలదొక్కుకోవడం మరింత పెద్ద సవాలు. ముఖ్యంగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల వారసులు (నేపోటిజం) ఆధిపత్యం చూపే ఇండస్ట్రీలో, సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి తమకంటూ ఒక సామ్రాజ్యం నిర్మించుకోవడం అంత సులభం కాదు. అయితే గత ఏడెనిమిదేళ్లలో భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక గమనించదగిన మార్పు కనిపిస్తోంది. వారసత్వపు గోడలను చెరిపేసి, కేవలం ప్రతిభనే ఆయుధంగా చేసుకుని ఎదిగిన 'సెల్ఫ్ మేడ్' స్టార్ల ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది.

Details

తన

ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చదివి వేల సంఖ్యలో ఆడిషన్లు ఇచ్చినవారు ఉన్నారు. సినిమా అవకాశాల కోసం డ్రైవర్‌గా, క్లాప్ బాయ్‌గా పనిచేసినవారు ఉన్నారు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ చిన్న పట్టణం నుంచి వెండితెరకు వచ్చినవారు కూడా ఉన్నారు. వీరికి స్టార్ హీరోల సపోర్ట్ లేదు, పెద్ద నిర్మాణ సంస్థల బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినప్పటికీ నేడు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటూ, వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ అగ్ర హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నారు. వీరంతా మన మధ్య నుంచే ఎదిగిన ప్రతిభావంతులే.

Details

టాలీవుడ్ స్టార్ బాయ్స్

తెలుగు చిత్రసీమలో సిద్దు జొన్నలగడ్డ ప్రయాణం ప్రత్యేకం. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి 'డీజే టిల్లు'తో తనకంటూ ఓ ప్రత్యేక మేనరిజాన్ని సృష్టించుకుని నేడు యూత్ ఐకాన్‌గా ఎదిగారు. అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయ, జాతి రత్నాలు చిత్రాలతో నవీన్ పొలిశెట్టి వంద కోట్ల మార్క్ అందుకుని మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు. వీరికి ముందే అడవి శేషు రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. విశ్వక్ షేన్, సుహాస్ వంటి వారు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. ఇక కిరణ్ అబ్బవరం 'KA' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టి మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Details

బాలీవుడ్‌లో 'ఆర్యన్' మార్కు

బాలీవుడ్‌లో అవుట్‌సైడర్లకు అవకాశాలు లేవనే విమర్శలను కార్తీక్ ఆర్యన్ తిప్పికొట్టారు. గ్వాలియర్ నుంచి వచ్చిన ఆయన 'భూల్ భూలైయా 2'తో బాక్సాఫీస్‌ను కాపాడి, నేడు ఒక్కో సినిమాకు రూ.40-50 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగారు. 'యానిమల్' తో నేషనల్ క్రష్‌గా మారిన ట్రిప్టి డిమ్రి, ప్రభాస్ సరసన 'స్పిరిట్'లో అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్‌లో పెద్ద మైలురాయి. అలాగే ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు తమ నటనతో వారసత్వాన్ని వెనక్కి నెట్టేశారు.

Advertisement

Details

కోలీవుడ్ మినీ సూపర్ స్టార్

తమిళ పరిశ్రమలో శివకార్తికేయన్ ఒక సంచలనం. టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరిగా నిలిచారు. 'అమరన్', 'డాన్' చిత్రాలతో సామాన్యుల సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందారు. అలాగే ప్రదీప్ రంగరాజన్ 'లవ్ టుడే'తో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ 100 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Details

కన్నడ, మలయాళంలో కూడా

రిషబ్ శెట్టి 'కాంతార'తో భారతీయ సినిమా దిశను మార్చేశారు. మట్టి కథను నమ్ముకుని నేషనల్ అవార్డు గెలుచుకోవడం ఆయన స్వయంకృషికి నిదర్శనం. మలయాళంలో టోవినో థామస్ 'మిన్నల్ మురళి'తో గ్లోబల్ గుర్తింపు పొందారు. వారసత్వం మొదటి అవకాశానికి దారి చూపించవచ్చు. కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే టాలెంట్ ఒక్కటే మార్గమని ఈ స్టార్లు నిరూపించారు. ప్రేక్షకులు కూడా కంటెంట్ బాగుంటే 'నేపో కిడ్' అన్న భేదం లేకుండా ఆదరిస్తున్నారు.

Advertisement