ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ
ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 ఈరోజు మొదలైంది. ఎన్నో రోజుల నుండి ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఊరట లభించింది. ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటర్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ వచ్చారు. హీరోయిన్ జాన్వీ కపూర్, ఇతర యాక్టర్లు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఈ కార్యక్రమంలో కనిపిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్, ప్రఖ్యాత నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై రాజమౌళి క్లాప్ కొట్టారు.
ఇది తన గొప్ప వర్క్ అంటున్న కొరటాల శివ
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొరటాల శివ, సముద్ర ప్రాంతంలో ఈ కథ జరుగుతుందనీ, ఇందులో మనుషులు క్రూరంగా ఉంటారనీ, దేవుడంటే భయం ఉండదనీ, దేనికీ భయపడరనీ, కానీ ఒక్క విషయంలో వాళ్ళు ఎక్కువ భయపడతారనీ అన్నాడు. ఆ భయమేంటో చెప్పకుండా దాచేసి, సినిమాలోనే తెలుస్తుందనీ చెప్పిన కొరటాల శివ, ఈ సినిమా, తన గొప్ప వర్క్ కాబోతుందని అన్నాడు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు, సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు శ్రీకర్ ప్రసాద్ చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు.