NTR and Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ 'కార్తికేయ' చిత్రం అధికారిక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 'అరవింద సమేత' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కార్తికేయుడి పురాణ గాథ ఆధారంగా తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దైవిక నేపథ్యంతో, పురాణ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై చాలా కాలంగా సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను సోమవారం అధికారికంగా ప్రకటించారు. యుద్ధ దేవుడిగా ప్రసిద్ధి చెందిన కార్తికేయుడి జీవిత గాథను అత్యంత భారీ స్థాయిలో ఆవిష్కరించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
వివరాలు
దైవిక అంశాలతో కూడిన కథ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు
'ఒక ఈటె... ఒక లక్ష్యం... ఒక దైవిక తీర్పు...' అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పోస్టర్ రూపకల్పనే ఈ ప్రాజెక్ట్ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూనే,ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలతో పాటు కొత్త కథా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఎన్టీఆర్ నటనకు త్రివిక్రమ్ కథ,మాటల బలం తోడవడం,దైవిక అంశాలతో కూడిన కథ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్టుగానే అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ సమకూర్చనున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.