NTR: పుట్టినరోజున కొత్త అతిథులను పరిచయం చేసిన తారక్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని పంచుకున్నారు. తన ఇంటికి కొత్తగా వచ్చిన రెండు అందమైన పక్షులను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. వాటికి 'అసాహి','యూహీ' అనే పేర్లు పెట్టినట్లు వెల్లడించారు. జపాన్ దేశంపై తనకున్న అభిమానానికి గుర్తుగా ఈ పేర్లు ఎంపిక చేశానని తారక్ పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం'దేవర: భాగం-1' ప్రచార కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులు చూపిన అభిమానానికి ఆయన ఎంతో ఆనందించారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం చూసిన తర్వాత ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకున్నాడనే విషయం తనను బాగా కదిలించిందని అప్పట్లో తెలిపారు.
వివరాలు
'డ్రాగన్'లో కీలక హంతకుడి పాత్రలో ఎన్టీఆర్
2022లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' చిత్రం జపాన్‌లో విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం 'డ్రాగన్'తో రాబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ప్రపంచ స్థాయి మత్తు పదార్థాల వ్యాపార యుద్ధం నేపథ్యంగా సాగే ఈ కథలో, ఆఫ్ఘన్ వ్యాపార సంస్థకు చెందిన కీలక హంతకుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు సమాచారం.