LOADING...
Obsession : రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. రూ.830 కోట్ల కలెక్షన్లతో సంచలనం
రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. రూ.830 కోట్ల కలెక్షన్లతో సంచలనం

Obsession : రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. రూ.830 కోట్ల కలెక్షన్లతో సంచలనం

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు సినిమా నిర్మించాలంటే సినీ నేపథ్యం లేదా భారీ బడ్జెట్ తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతిభతో పాటు వినూత్నమైన కథ ఉంటే చాలని కొత్త తరం దర్శకులు నిరూపిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ కూడా అలాంటి వారిలో ఒకరు. తానే రాసుకున్న కథతో దర్శకుడిగా మారిన ఆయన, తన తొలి ఫీచర్ ఫిల్మ్ 'అబ్సెషన్' ద్వారా సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.

వివరాలు

ఆకట్టుకుంటున్న హారర్ సైకాలజికల్ థ్రిల్లర్‌..

హారర్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కేవలం 0.75 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో, అంటే సుమారు రూ.6.25 కోట్ల వ్యయంతో నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో పూర్తి చేశారు. అయితే థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 రోజుల్లోనే 100 మిలియన్ డాలర్లకు పైగా, అంటే దాదాపు రూ.830 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. పెట్టుబడితో పోలిస్తే వంద రెట్లకు పైగా లాభాలను అందిస్తూ, 2026లో అత్యధిక లాభాలు తెచ్చిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

వివరాలు

సినిమా కథ ఏంటంటే..

ఈ సినిమా కథ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిన్ననాటి స్నేహితురాలు, తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమలో పడేయాలని కోరుకున్న ఓ యువకుడు, అతీత శక్తులు కలిగిన ఓ బొమ్మ సహాయంతో కోరిక కోరుతాడు. ఆ కోరిక నెరవేరి ఆ యువతి అతడి జీవితంలోకి వస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె చూపించే అతిగా ప్రేమ, మోజు క్రమంగా భయంకరమైన హింసాత్మక రూపం దాల్చుతుంది. ఈ నేపథ్యంతో తెరకెక్కిన ఈ హారర్ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తోంది. సరికొత్త హారర్ ఎలిమెంట్స్, భయపెట్టే సన్నివేశాలు, నటీనటుల బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

వివరాలు

సంచలనం సృష్టించిన మూవీ..

ముఖ్యంగా థియేటర్లలో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో హారర్ సినిమాల అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలో భారతదేశంలో కూడా విడుదల కానుంది. భారత సెన్సార్ బోర్డు (CBFC) నుంచి అనుమతులు పొందిన ఈ సినిమాను దేశంలోని పలు మల్టీప్లెక్స్‌లలో ప్రత్యేక నైట్ షోల రూపంలో ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కర్రీ బార్కర్, ఇప్పుడు హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన రూపొందించిన ఈ హారర్ సంచలనాన్ని ఆస్వాదించాలంటే తప్పకుండా థియేటర్లలో చూడాల్సిందే.

Advertisement