Operation safed sagar review: 'ఆపరేషన్ సఫేద్ సాగర్'.. సిద్ధార్థ్ నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
జీవిత కథలు, వాస్తవ సంఘటనలను తెరపై ఆవిష్కరించడం కొత్తేమీ కాదు. అయితే ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా కథలకు మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా చారిత్రక ఘట్టాలు, దేశభక్తితో ముడిపడిన కథలను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ'. 1999లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం, ఆ సమయంలో భారత వాయుసేనకు చెందిన 'ది గోల్డెన్ యారోస్' విభాగం పోషించిన కీలక పాత్ర ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
వివరాలు
కథేంటంటే..
భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో శాంతి చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లిన సమయంలోనే సరిహద్దు అవతల ఓ కుట్రకు బీజం పడుతుంది.
ఆధిపత్య ధోరణితో వ్యవహరించే పాక్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్.. నవాజ్ షరీఫ్‌కు తెలియకుండానే ఓ రహస్య పథకాన్ని రచిస్తాడు.
నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట ఉన్న భారత సైనిక స్థావరాలను పాక్ సైనికులు ఉగ్రవాదుల వేషంలో వెళ్లి ఆక్రమించేలా పన్నాగం పన్నుతాడు.
ఈ కుట్రలో భాగంగా పాక్ సైనికులు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఎత్తైన కొండ ప్రాంతాలను ఆక్రమిస్తారు.
పాకిస్థాన్ పన్నిన కుట్ర గురించి తెలుసుకున్న భారత్.. శత్రు సేనలను తరిమికొట్టేందుకు సిద్ధమవుతుంది.
వివరాలు
కార్గిల్ యుద్ధంపై సినిమా..
దీంతో కార్గిల్ యుద్ధం మొదలవుతుంది. అయితే అత్యంత ఎత్తైన, క్లిష్టమైన భూభాగాల్లో తిష్ఠవేసిన పాక్ సేనలను తరిమికొట్టి, ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత సైన్యానికి సవాల్‌గా మారుతుంది.
భారత వాయుసేనకు చెందిన 'ది గోల్డెన్ యారోస్' దళం రంగంలోకి దిగుతుంది.
వింగ్ కమాండర్ బి.ఎస్. ధనోవా (జిమ్మీ షేర్‌గిల్) నేతృత్వంలో యువ పైలట్ల బృందం దేశం కోసం ఎలాంటి పోరాటం చేసింది?
వారికి ఎదురైన అత్యంత క్లిష్టమైన సవాళ్లేంటి? అప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఏ దేశ వాయుసేన కూడా చేయని సాహసాన్ని 'ది గోల్డెన్ యారోస్' ఎలా చేసింది?
యుద్ధంలో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా (సిద్ధార్థ్) చేసిన త్యాగం ఎలాంటిది? అనే విషయాలను ఈ వెబ్ సిరీస్‌లో చూడాల్సిందే.