ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు ఇంకా సెట్స్ మీద ఉండగానే మరో మూవీ మొదలెట్టేసారు పవన్ కళ్యాణ్. ప్రభాస్ తో సాహో సినిమా తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా ఉండనుందని గతంలోనే ప్రకటన వచ్చింది. తాజాగా ఈ సినిమా, పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోని పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేసింది డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటూ వార్తలు
ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్లలో ఉన్న వాక్యాలను తీసుకుని, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ తో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పూజా కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఉంటున్నాడని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని చెప్పుకుంటున్నారు. వీలైతే ఇదే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.