హరిహర వీరమల్లు: పవన్ కళ్యాణ్ చేతిలోకి కోహీనూర్ వజ్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో అనేక అంచనాలు ఉన్నాయి. బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. ఔరంగజేబు కాలంలో ఈ కథ జరుగుతుందని కూడా వినిపించింది. ప్రస్తుతం ఈ మాటలను నిజం చేస్తూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. హరిహర వీరమల్లు సినిమాలో కోహీనూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ పాత్ర దొంగిలిస్తుందట. 1660ల ప్రాంతంలో భారతదేశాన్ని పాలిస్తున్న ఔరంగజేబు దగ్గరనుండి ఈ వజ్రాన్ని దొంగిలిస్తాడట. నిజానికి కోహీనూర్ వజ్రం గురించిన చరిత్ర 1740లో నాదిర్ షా దాన్ని దొంగిలించిన తర్వాతే మొదలైంది. ఆ వజ్రం గురించిన అంతకుముందు సమాచారం స్పష్టమైన ఆధారాలతో అందుబాటులో లేదు.
నిజమైన వజ్రాన్ని కొనే పనిలో చిత్ర నిర్మాత
ఈ వజ్రాన్ని దొంగిలించే సన్నివేశాలు రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారట. దానికోసం నిజమైన ఒక వజ్రాన్ని కొంటున్నారట. తెరమీద అందంగా కనబడి, చూసేవాళ్ళకు నిజంగా వజ్రాన్ని చూస్తున్న ఫీలింగ్ రావాలని కొత్త వజ్రం కొందామని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల్ని వేరే లెవెల్లో చిత్రీకరిస్తున్నారట. ఇదంతా చూస్తుంటే హరిహర వీరమల్లు చిత్రం ఒక సరికొత్త అనుభవం ఇచ్చే దిశగా సాగుతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ చేస్తోంది. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను దయాకర్ రావు నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.