Peddi pre release event: ఈరోజే 'పెద్ది' ప్రీ రిలీజ్ వేడుక.. వేదికపై సందడి చేయనున్న స్టార్ అతిథులు వీరే
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుబ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, తాజాగా నిర్వహించనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఏఆర్. రెహమాన్ రూపొందించిన ఆల్బమ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవల విడుదలైన పవర్‌ఫుల్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు పూర్తి చేసుకున్న చిత్రబృందం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది.
వివరాలు
ఇవాళ సాయంత్రం 5 గంటలకు వేడుక ప్రారంభం
ఈ క్రమంలో 'పెద్ది' గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు సహా చిత్రబృందం మొత్తం విజయవాడకు రానుంది. ఇప్పటికే నగరమంతా మెగా అభిమానుల సందడితో కళకళలాడుతోంది. పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ఈ వేడుక సినిమా విడుదలకు ముందు హైప్‌ను మరింత పెంచనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
ఒకే వేదికపై సందడి చేయనున్న మెగా హీరోలు
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు మరికొందరు మెగా హీరోలు కూడా ఈ వేదికపై సందడి చేయనున్నట్లు సమాచారం. ఒకే వేదికపై మెగా బ్రదర్స్‌తో పాటు రామ్ చరణ్ కనిపించనున్న నేపథ్యంలో అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టించిన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.