LOADING...
Peddi: చరణ్ కష్టానికి ఫలితం.. విడుదలకు ముందే రికార్డు సృష్టించిన 'పెద్ది'
చరణ్ కష్టానికి ఫలితం.. విడుదలకు ముందే రికార్డు సృష్టించిన 'పెద్ది'

Peddi: చరణ్ కష్టానికి ఫలితం.. విడుదలకు ముందే రికార్డు సృష్టించిన 'పెద్ది'

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది' సినిమా విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఓవర్సీస్ మార్కెట్లలో జూన్ 3 నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టికెట్లు వేగంగా అమ్ముడవుతుండటంతో ఈ సినిమా విడుదలకు ముందే నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. దీంతో రిలీజ్‌కు ముందే ఈ ఘనత సాధించిన చిత్రంగా నిలిచింది.

వివరాలు 

ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్రబృందం

'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ప్రీమియర్ షోల ద్వారానే రామ్ చరణ్‌కు వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటు దక్కిన మరో సినిమాగా 'పెద్ది' నిలవడం విశేషం. ఇదిలా ఉండగా, సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేసింది. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ పాత్ర కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారని తెలిపారు.

వివరాలు 

చరణ్ కంటికి గాయం

'పెద్ది' పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, అందుకు ప్రధాన కారణం చరణ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై నటించడమేనని చెప్పారు. ముఖ్యంగా కుస్తీ పోరాట సన్నివేశాల చిత్రీకరణలో గాయాలు అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తన పాత్రకు న్యాయం చేశారని కొనియాడారు. ఒక సందర్భంలో చరణ్ కంటికి గాయం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందిస్తారోనని తాను ఆందోళన చెందానని వెల్లడించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement