Venkatesh Maha : ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు వెంకటేష్ మహా ట్విట్టర్ ఖాతా డియాక్టివేట్?
కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో సినీ విమర్శకులే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుండి దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' వంటి డిఫరెంట్ జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక గత కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్ తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. తాజాగా నెటిజన్ల విమర్శకులకు భయపడి ఆయన ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను డి యాక్టివేట్ చేసుకోవడం అందరిని షాక్‌కు గురి చేసింది. డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో దర్శకుడు వెంకేటష్ మహా చేసిన ట్వీట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
వివరణ ఇచ్చిన కాసేపటికే డీ యాక్టివేట్ చేసిన వెంకటేష్
డంకీ సినిమాను తొలి రోజే మొదటి ఆట చూడాలని వేచి చూస్తున్నానని, తన అభిమాన నటుడు షారుక్ ఖాన్, తన అభిమాన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో వస్తుండడం ఆనందంగా ఉందని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ సినిమాను సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు తెలుస్తోందని, అది నిజమైతే మరో అద్భుతమైన సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ట్వీట్ చేశారు. సలార్ గురించి మాట్లాడకుండా డంకీ గురించి రాస్తావా అంటూ వెంకటేష్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. తాను ప్రభాస్ సినిమాను తక్కువ చేయలేదని, ఈ విషయంలో గందరగోళం సృష్టించి వాస్తవాలను తప్పదారి పట్టిస్తున్నారని వెంకటేష్ వెల్లడించారు. ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే తన ట్విట్టర్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేయడం గమనార్హం.