ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. వివిధ పాత్రల్లో కనిపించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అన్నయ్యగా, తండ్రిగా, తాతగా, విలన్ గా, కమెడియన్ గా పాత్ర ఏదైనా వెండితెర మీద అద్భుతాన్ని సృష్టిస్తాడు ప్రకాష్ రాజ్. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చిత్రాల్లో నటించిన ప్రకాష్ రాజ్, తన ఖాతాలో ఐదు జాతీయ అవార్డులను అందుకున్నాడు. మరెన్నో రాష్ట్ర స్థాయి అవార్డులను దక్కించుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా మారి సినిమాలను తెరకెక్కించారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ వైవిధ్యంగా కనిపించిన తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం.
ప్రకాష్ రాజ్ కు పేరు తెచ్చిన తండ్రి పాత్రలు
అంతఃపురం: కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అప్పట్లో సంచలనంగా నిలిచింది. ఇందులో ప్రకాష్ రాజ్ నటనకు జాతీయ అవార్డ్ లభించింది. బొమ్మరిల్లు: తండ్రి పాత్రలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ బొమ్మరిల్లు సినిమాలోని పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో మెయిన్ హీరో సిద్ధార్థ్ అయితే, మరో హీరో ప్రకాష్ రాజ్ అనే చెప్పవచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ పక్కావారిని పలకరిస్తూ ఉండే పాత్ర ఇది. ఎంతో అమాయకంగా కనిపించే పాత్రలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతంగా ఉంటుంది. పరుగు: ప్రేమించిన వాడితో కూతురు లేచిపోతే తండ్రి పడే బాధను చూపించే పాత్రలో ప్రకాష్ రాజ్ జీవిస్తాడు.