Prasanth Varma: సింబా వస్తున్నాడు.. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్.. పోస్ట్ వైరల్
నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ (Mokshagna)సినీ రంగంలో ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు వారి ఆసక్తిని మరింత పెంచుతూ 'సింబా ఈజ్ కమింగ్' అనే అంశంతో వరుసగా పోస్టులు షేర్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రశాంత్ వర్మ ఒక సింహం తన పిల్లతో ఉన్న ఫొటోను షేర్ చేసి 'నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది' అని వ్యాఖ్యానించారు. ఈ పోస్టుకు 'సింబా ఈజ్ కమింగ్' అనే హ్యాష్‌ట్యాగ్ జోడించారు. ఇది చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ కోసం ఈ పోస్ట్ ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మరో పోస్టుతో వారి ఆనందాన్ని రెట్టింపు చేశారు.
ప్రశాంత్ వర్మ రెండో ప్రాజెక్టుగా మోక్షజ్ఞ సినిమా
'వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం' అంటూ ఇంకొక పోస్ట్ చేశారు. రేపు ఉదయం 10.36కి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. దీంతో, ఫ్యాన్స్ మోక్షజ్ఞను త్వరలోనే చూడబోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) కింద రెండో ప్రాజెక్టుగా మోక్షజ్ఞ సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రశాంత్ వర్మ సరికొత్త వివరాలు వెల్లడిస్తారో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లపై పని చేస్తున్నారు. మొదటి దశలో ఆరుగురు సూపర్ హీరోలతో సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించారు.
సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు
ప్రతి ఏడాది ఒక సినిమా విడుదల చేస్తానని చెప్పిన ఆయన, జై హనుమాన్ కంటే ముందు 'అధీర', 'మహాకాళి' సినిమాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక సినిమాలో మోక్షజ్ఞ కనిపిస్తాడా అని కూడా కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ 'హనుమాన్' సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు.'జై హనుమాన్' పేరుతో ఇది రూపొందనుంది. ''హనుమాన్ కంటే వంద రెట్లు భారీగా 'జై హనుమాన్' ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు కానీ , హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. కానీ ఆ సినిమా హీరో ఆంజనేయస్వామి. ఆ పాత్రను స్టార్ హీరో చేస్తారు'' అని ప్రశాంత్ వర్మ సీక్వెల్ గురించి వివరించారు. 2025లో ఈ సినిమా విడుదల కానుంది.