LOADING...
Prashanth Neel: 'డ్రాగన్‌' కోసం తారక్‌ చేసిన సాహసం ఇదే!
'డ్రాగన్‌' కోసం తారక్‌ చేసిన సాహసం ఇదే!

Prashanth Neel: 'డ్రాగన్‌' కోసం తారక్‌ చేసిన సాహసం ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
09:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న 'డ్రాగన్‌' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని విడుదలైన గ్లింప్స్‌ అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్‌తో సినిమా చేయడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆయన తెలిపారు. గత 25 ఏళ్లుగా తారక్‌కు తాను అభిమానినని, ఆయన నటించిన మాస్‌ చిత్రాలన్నీ చూసానని చెప్పారు. చివరకు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఐదేళ్ల క్రితమే ఈ సినిమా కథపై ఎన్టీఆర్‌తో చర్చలు ప్రారంభమైనప్పుడు స్టోరీ లైన్‌ చెప్పినట్టు తెలిపారు.

వివరాలు 

ఎన్టీఆర్ కి 'లూగర్‌' అనే తుపాకీ పేరు

ఏ క్యారెక్టర్‌ అయినా రైటా? రాంగా? అనేది చూడలేదు. డ్రామా పండుతుందా, లేదా? అన్నదే చూశారు. కథను పూర్తిగా సిద్ధం చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టిందని తెలిపారు. స్టార్‌ హీరో ఇలాంటి పాత్ర పోషించడం పెద్ద రిస్క్‌ అని తెలిసినా అంగీకరించారు. సినిమాలో ఎన్టీఆర్‌ పోషిస్తున్న పాత్ర పేరు 'లూగర్‌' అని, ఇప్పటివరకు తాను రాసిన పాత్రల్లో ఇదే అత్యంత గాఢమైన, భిన్నమైన పాత్ర అని చెప్పారు. ఈ పాత్రలో ప్రతినాయక లక్షణాలు కూడా బలంగా కనిపిస్తాయని వెల్లడించారు. 'లూగర్‌' అనే తుపాకీ పేరు ఆ పాత్రకు ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుందని ఆసక్తి పెంచారు.

వివరాలు 

తక్కువ సమయంలో 15 కిలోల బరువు తగ్గిన ఎన్టీఆర్ 

ఈ పాత్ర కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా శ్రమించారని ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు. చాలా తక్కువ సమయంలోనే ఆయన దాదాపు 15 కిలోల బరువు తగ్గారని చెప్పారు. ఆయన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులతో పాటు చిత్రబృందం కూడా ఆందోళన చెందిందన్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్‌ మాత్రం వెనక్కి తగ్గలేదని, తన పనిపై ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిదని కొనియాడారు. ఈ కథలోని భావోద్వేగ ఘట్టాలను తాము కలిసి అభివృద్ధి చేశామని దర్శకుడు వివరించారు. 'కేజీయఫ్‌', 'సలార్‌' చిత్రాలకు భిన్నంగా ఎన్టీఆర్‌తో పూర్తిగా కొత్త తరహా కథను తెరకెక్కించాలని భావించామని చెప్పారు. మొదట పురాణ నేపథ్య కథ చేయాలనుకున్నప్పటికీ, ఆ తర్వాత మరింత విభిన్నమైన ఆలోచనగా 'డ్రాగన్‌' రూపుదిద్దుకుందని వెల్లడించారు.

Advertisement

వివరాలు 

అన్ని సినిమాలను ఒకే ప్రపంచంగా చూపించే ఆలోచన

తన సినిమాలన్నీ ఒకే తరహాలో కనిపిస్తాయని చాలామంది అనుకుంటారని, కానీ ప్రతి కథలో భావోద్వేగం, నాటకీయత మాత్రం వేరుగా ఉంటాయని ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నారు. ప్రేక్షకులకు బలమైన భావోద్వేగ అనుభూతిని అందించడంపైనే తాను ఎక్కువ దృష్టి పెడతానని తెలిపారు. ఒక దశలో అన్ని సినిమాలను ఒకే ప్రపంచంగా చూపించే ఆలోచన చేసినప్పటికీ, తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పారు.

Advertisement