Page Loader
Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు!
శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు!

Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో విధివిరుద్ధంగా ప్రైవేటు పూజలు నిర్వహించిన వేద పండితుడిపై ఆలయ యాజమాన్యం సస్పెన్షన్‌ విధించింది. ఈ నెల 29న సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో గల రాఘవేంద్ర స్వామి మఠంలో నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయంలో పనిచేస్తున్న కొందరు అర్చకులు, వేద పండితులు పాల్గొనడం ఆలయ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో విధిగా అమలులో ఉన్న నియమాల ప్రకారం, అర్చకులు, వేద పండితులు ఆలయం వెలుపల, ప్రైవేటుగా పూజలు నిర్వహించేందుకు అనుమతి లేదు. ఆలయ పరిధిలో మాత్రమే ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని యాజమాన్యం పేర్కొంది.

Details

పండితుడిపై సస్పెన్షన్‌ వేటు

అయినా ఈ నిబంధనను ఉల్లంఘించి, రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు నిర్వహించడంతో, సంబంధిత వేద పండితుడిపై తక్షణ సస్పెన్షన్‌ వేటు వేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఆలయ అధికారులు, "శ్రీకాళహస్తి ఆలయం అనేది రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ నిర్వహించే పూజలు సాంప్రదాయబద్ధంగా, ఆలయ నిబంధనల మేరకు మాత్రమే జరగాలి. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, మేము కఠినంగా స్పందిస్తాం. ఆలయ పరిపాలనలో రాజీకి తావు లేదని పేర్కొన్నారు. ఈ పరిణామం తర్వాత ఆలయ యాజమాన్యం అంతర్గతంగా మరిన్ని విచారణలు ప్రారంభించగా, సంబంధిత అర్చకులు, ఇతర వేద పండితులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.