Priyanka Chopra: నిక్ జోనాస్‌తో విడాకులు? ప్రియాంక చోప్రా ఫుల్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశాలు వేరు కావడం వల్ల సంబంధాలు తెగిపోవాల్సిన అవసరం లేదని చెబుతూ.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై వస్తున్న వదంతులపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా నిక్ జోనాస్ తో విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. తమ మధ్య దేశం, మతం, వయస్సులో ఉన్న తేడాలను చూపిస్తూ కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. అయితే గత ఎనిమిదేళ్లుగా తమ బంధం ఎంతో బలంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. కేవలం ఆరు నెలల పరిచయంతోనే పెళ్లి జరిగినప్పటికీ, నిక్‌లోని నిజాయితీ తమ సంబంధాన్ని మరింత బలంగా చేసిందని, ఇతరుల అభిప్రాయాలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని ఆమె స్పష్టం చేశారు.
వివరాలు
కూతురు కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
కుటుంబ భద్రత విషయంలో, ముఖ్యంగా తన కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్ ప్రైవసీకి సంబంధించి ప్రియాంక ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీగా ఉండటం వల్ల బయటకు వెళ్లిన ప్రతిసారి, ఉదాహరణకు పార్కులు లేదా డిన్నర్‌కు వెళ్లినప్పుడు, అనుమతి లేకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనతో నేరుగా మాట్లాడే వారిని గౌరవిస్తానని, కానీ ముందస్తు అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీయడం తనకు ఇష్టం ఉండవన్నారు. అందుకే తన కుమార్తె రక్షణ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేసుకున్నానని, అవి తన వ్యక్తిగత అవసరాల కోసం కాదని ఆమె వివరించారు.
వివరాలు
హాలీవుడ్ ప్రయాణం సాహసమే..
వృత్తి పరంగా చూస్తే, ఇష్టమైన పనిని చేస్తూనే కుటుంబంతో సమయం గడపడం నిజమైన విజయమని ప్రియాంక అభిప్రాయపడ్డారు. బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా ఎదిగిన తరువాత, ముప్పై ఏళ్ల వయసులో అన్నింటినీ వదిలి హాలీవుడ్‌లో కొత్త ప్రయాణం ప్రారంభించడం పెద్ద సాహసమేనని చెప్పారు. ఆరంభంలో తనకు పరిమితమైన పాత్రలే వచ్చినప్పటికీ, పట్టుదలతో ముందుకు సాగి ఇప్పుడు తాను ఇష్టపడే పాత్రలను ఎంచుకునే స్థాయికి చేరుకున్నానని ఆమె తెలిపారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ, కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.