Pushpa 2 Review: అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన 'పుష్ప2: ది రూల్' ప్రేక్షకులను మెప్పించిందా?
ఒక పాత్ర బ్రాండ్‌గా మారిపోయిందన్నా... ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్నా, దానికి కారణం "పుష్ప: ది రైజ్." అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ విజయానికి కొనసాగింపుగా రూపొందిన 'పుష్ప 2: ది రూల్' విడుదలకు ముందే భారీ అంచనాలను సృష్టించింది. ఈసారి నేషనల్ స్థాయిని మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పుష్పరాజ్ వైల్డ్ ఫైర్‌లా ప్రభావం చూపించేలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? మొదటి భాగానికి దీటుగా ఉందా లేదా అనేది ఆసక్తికరం.
Pushpa 2 కథ
శేషాచలం అడవుల్లో సాధారణ కూలీగా తన ప్రయాణం ప్రారంభించి, ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకుడిగా ఎదిగిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) కథ ఇది. తన దారికి ఎవరు ఎదురొచ్చినా "తగ్గేదేలే" అనే ధైర్యంతో ఢీ కొట్టడం అతని నైజం. డబ్బుకు విలువ ఇవ్వడు, పవర్‌కు భయపడడు. తన పేరునే ఓ బ్రాండ్‌గా మార్చుకుని ఎదుగుతాడు. ఈ సమయంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్)తో అతని వైరం మరింత పెద్దదవుతుంది. పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంపై దృష్టి పెట్టగా, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం భార్య శ్రీవల్లి (రష్మిక మందన్న) మాటకు ప్రధాన్యత ఇస్తాడు.
షెకావత్‌తో పుష్ప విభేదాలు
తన భార్యకు తన భర్త ముఖ్యమంత్రితో ఫోటో తీసుకోవాలని ఉండగా, పుష్ప ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడు (రావు రమేష్) సహాయంతో సీఎంకు దగ్గరవతాడు. అయితే, ఈ పరిణామాల తర్వాత ఏమి జరుగుతుంది? షెకావత్‌తో పుష్ప విభేదాలు ఎలా సునామీగా మారాయి? పుష్ప వ్యాపారం రాజకీయాల్లో ఎలా ప్రభావం చూపింది? కేంద్రమంత్రి వీరప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో పుష్పకీ ఉన్న సంబంధం ఏమిటి? ఈ బంధం వైరంగా ఎలా మారింది? వీటన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే
తొలి భాగంతో పోలిస్తే, దర్శకుడు సుకుమార్ 'పుష్ప' ప్రపంచాన్ని మరింత విస్తృతంగా, అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈసారి కథ,మేకింగ్ పరంగా నేషనల్ స్థాయిని దాటించి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు. ఫైర్ కాదు,వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ప్రతి అంశంలోనూ పెరిగిన స్థాయి స్పష్టంగా కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్ మాస్ ఇమేజ్‌పై ఆధారపడిన సుకుమార్, ఈసారి తన మార్క్ సైకలాజికల్ గేమ్‌ని కథలో జొప్పించాడు. దీని వలన కథలో మరింత డ్రామా పండింది. అలాగే పుష్పరాజ్ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దగా,అల్లు అర్జున్ తన అద్భుత నటనతో ఆ పాత్రను మరింత శక్తివంతంగా చూపించాడు. ఫలితంగా ఈ సినిమా అభిమానులకు పండగగా ఉంటే,సాధారణ ప్రేక్షకులకు ఓ బలమైన మాస్ ఎంటర్టైనర్ అనుభూతి కలిగిస్తుంది.
వంద కోట్ల రూపాయలతో పుష్ప చేసే కొనుగోలు
సినిమా ఆరంభంలోనే ఇంటర్నేషనల్ టచ్‌ను చూపిస్తూ, ప్రతి దశలో ఎలివేషన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. షెకావత్ చేతిలో ఉన్న తన అనుచరులను పోలీస్ స్టేషన్‌లో నుంచి విడిపించడం మొదలుకుని, ముఖ్యమంత్రి వద్ద తన మార్క్ రాజకీయాలు చేయడం వరకు, పుష్ప పాత్ర నైజాన్ని బలంగా ఆవిష్కరించాడు. మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ వంద కోట్ల రూపాయలతో పుష్ప చేసే కొనుగోలు కీలక ఎలివేషన్‌గా నిలిచింది. పుష్ప, షెకావత్ మధ్య జరుగుతున్న ఎత్తులు పైఎత్తులు అసలైన డ్రామాని పండించాయి. ప్రథమార్థంలో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటే, విరామానికి ముందు వచ్చే సీక్వెన్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
భార్య మాట జవదాటని భర్తగా
పుష్ప, షెకావత్‌ను ఊహించని విధంగా ఝలక్ ఇవ్వడం ఉత్కంఠ రేపుతుంది. సినిమా మొత్తం పుష్ప వ్యాపారం చుట్టూ కాకుండా కుటుంబ నేపథ్యంతో కూడిన డ్రామాకి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. భార్య శ్రీవల్లితో పుష్ప సంబంధం, అతడు ఆమె మాట జవదాటని భర్తగా ఉండే తీరు, వారి మధ్య ప్రేమ, భావోద్వేగాల సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. భర్త భార్య మాట వింటే ఏమవుతుందనే అంశాన్ని కథలో భాగస్వామ్యం చేసిన విధానం ప్రశంసనీయంగా నిలిచింది.
హైలైట్‌గా గంగమ్మ జాతర ఎపిసోడ్
ద్వితీయార్ధంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ పుష్ప 2లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ చీర కట్టుకున్న సన్నివేశాలు థియేటర్‌ను సందడి చేస్తాయి. జాతరలో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుకొని ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అదే సమయంలో, శ్రీవల్లి పాత్ర ఈ ఎపిసోడ్‌లో కీలకంగా మారుతుంది. అనంతరం, రెండు వేల కోట్ల విలువైన ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశ సరిహద్దుల్ని దాటించే కథనాన్ని చూపించే భాగం ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తుంది. ద్వితీయార్ధం ప్రధానంగా కుటుంబ నేపథ్య సన్నివేశాల చుట్టూ నడుస్తుంది. ప్రి క్లైమాక్స్,క్లైమాక్స్ ఎపిసోడ్లు,కథలో కొత్త మలుపులు తీసుకువచ్చి పూర్తి కొత్త దృక్పథాన్ని అందిస్తాయి.
ఎలా ఉందంటే
అయితే, కథలోని అసలు డ్రామా కొంత కట్ అయినట్టు అనిపించినా, పతాక ఘట్టాల్లో వచ్చే పోరాట సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. పాటల పరంగా కూడా సినిమా ప్రత్యేకతను నిలబెట్టింది. ఫస్ట్ హాఫ్‌లో "పీలింగ్" పాట మాస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన పొందగా, సెకండ్ హాఫ్‌లో "సూసేకి" ,"కిస్సిక్" పాటలు ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయంటే తప్పేమీ లేదు. మూడు గంటల నిడివి కలిగిన ఈ సినిమాలో కొన్ని చోట్ల సాగదీత ఎక్కువగా కనిపిస్తుంది. ఆరంభంలో వచ్చే ఫైట్ సీన్‌కి, అసలు కథకీ మధ్య సంబంధం కనిపించదు.
ఎలా ఉందంటే
ద్వితీయార్థంలో షెకావత్‌కు పుష్ప ఓ బాక్స్‌లో పువ్వు పంపించడం, ఆ తర్వాత ఇద్దరూ సంజ్ఞలతో మాటలాడుకుంటూ సాగే ఎపిసోడ్ నిరుత్సాహకరంగా అనిపిస్తుంది. సంభాషణల ప్రదర్శనలో స్పష్టత కొద్దిగా తగ్గినట్లు తెలుస్తుంది. మొదటి చిత్రానికి సమానంగా బలమైన విలనిజం ఈ సినిమాలో కనిపించలేదు. షెకావత్ పాత్రను పరిచయం చేయడంలో ఎంత బిల్డప్ చూపించారో, దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం అంత తీవ్రత కనిపించలేదు. విలన్ పాత్ర బలంగా ఉంటేనే హీరో పాత్ర మరింత ఎలివేట్ అవుతుంది. కానీ, పుష్ప పాత్ర బలం ముందు షెకావత్ తక్కువగా కనిపించాడు. మంగళం శ్రీను, ద్రాక్షాయణి పాత్రలు ఈసారి మరింత సాదాసీదాగా సాగిపోయాయి. అయితే, ఓ ఆసక్తికర మలుపుతో 'పుష్ప 3'కు బాటలు వేస్తూ సినిమాను ముగించారు.
ఎవరెలా చేశారంటే..
అల్లు అర్జున్: అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. యాస, హావభావాలు ఈసారి మరింత నైపుణ్యంతో ప్రదర్శించాడు. పోరాట ఘట్టాలు, డ్యాన్స్‌లలో అతని ప్రదర్శన చాలా గొప్పగా కనిపిస్తుంది. జాతర ఎపిసోడ్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరింత నెక్ట్స్ లెవల్‌కు చేరుకుంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న సందేహాలను తన నటనతో తొలగించి బన్ని మరోసారి సత్తా చాటాడు. రష్మిక: రష్మికతో కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా కుదిరింది.పీలింగ్స్‌తో కూడిన సీన్లు,పాటల్లో ఇద్దరి జోడీ ఆకట్టుకుంటుంది.ఆమె డ్యాన్స్‌లు,గ్లామర్ ప్రదర్శన ఈ సినిమాతో మరింత మెరుగైనదిగా నిలిచాయి. జాతర ఎపిసోడ్‌లోనూ రష్మిక నటన ప్రత్యేకంగా నిలిచింది. శ్రీలీల'కిస్సిక్' పాటతో మెరిసి తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది.తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఎవరెలా చేశారంటే..
ఫహద్ ఫాజిల్ షెకావత్ పాత్రలో ఒదిగిపోయినప్పటికీ, ఆ పాత్రకు అవసరమైన ప్రాధాన్యం ఎక్కువగా లేకపోవడం కొన్ని చోట్ల తేలిపోయినట్లు అనిపించింది. పాత్ర పరిచయం సమయంలో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, కథ కొనసాగుతున్న కొద్దీ ఆ గంభీరత తగ్గిపోయింది. పాత్ర ముగింపు కూడా అంత సంతృప్తికరంగా అనిపించదు. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఉంది. అయితే, పతాక సన్నివేశాల్లో జగపతిబాబు, తారక్ పొన్నప్ప భయపెట్టే ప్రదర్శన చేశారు. అల్లుఅర్జున్ స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్ర పోషించాడు. 'పుష్ప1' కథను కేశవ పాత్రతో చెప్పడం వల్ల ఉన్న మేజిక్ ఈసారి కొరవడింది.
సాంకేతికత
సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో ఉంది. ప్రతీ విభాగం తన పనితీరును చూపించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో తోడ్పాటు అందించాడు. కూబా కెమెరా పనితనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, కళా విభాగం సమన్వయంతో ప్రతి ఎపిసోడ్ గొప్పగా కనిపించింది. శ్రీకాంత్ విస్సా రచించిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. కానీ ఎడిటింగ్‌లో కొద్దిగా పదును తగ్గినట్లు అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం హీరోయిజం,భావోద్వేగాల పరంగా మరో మారు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రతినాయక పాత్రల రూపకల్పనలోని లోపాలు కొంచెం నిరాశ కలిగించాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ప్రతీ సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపించాయి. మొత్తం మీద సినిమా గ్రాండియర్‌గా, రిచ్‌గా అనిపించింది.
బలాలు
అల్లు అర్జున్ నటన ప్రతి సన్నివేశంలో ఆకట్టుకునేలా ఉంది. మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఉర్రూతలూగించేలా తీర్చిదిద్దారు. జాతర ఎపిసోడ్‌లో ఉన్న భావోద్వేగ దృశ్యాలు ప్రేక్షకులను భావప్రాప్తికి దింపాయి. పాటలు, డ్యాన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బలహీనతలు: విలనిజం తక్కువ బలం కలిగినదిగా అనిపించింది. ద్వితీయార్థంలో కథలో ఆసక్తి కొంత తగ్గినట్లు కనిపించింది. చివరగా: "పుష్ప 2" థియేటర్లలో అల్లు అర్జున్ రప్ప రప్పా చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాడు.