Muttiah: సరదాగా, ఎమోషనల్‌గా 'ముత్తయ్య'.. ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా 'ముత్తయ్య' నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం.
ఇప్పటికే ఈ చిత్రం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా అవార్డులు కూడా గెలుచుకుంది. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
ముత్తయ్య మూవీ ట్రైలర్‌ను ఏప్రిల్ 28న దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ విశేషాలతో పాటు స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూద్దాం.
Details
వృద్ధుడి సినిమా కలలు
చెన్నూరు అనే చిన్న గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ముత్తయ్య (సుధాకర్ రెడ్డి) చుట్టూ కథ తిరుగుతుంది. నాటకంలో వేషం కోసం ఒకరిని అడగడం నుంచి ట్రైలర్ ప్రారంభమవుతుంది.
సినిమాలపై ముత్తయ్యకు అపారమైన అభిమానం ఉంటుంది. పాత సినిమాలంటే ఎక్కువ ఇష్టం ఉన్నా, నేటి సినిమాలను కూడా చూస్తూ యాక్టింగ్ నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తాడు.
మెకానిక్ మల్లి అనే యువకుడితో ముత్తయ్యకు మంచి స్నేహం ఉంటుంది.
Details
సరదాగా సాగే కలలు
యాక్టింగ్‌పై మక్కువతో ముత్తయ్య తన వీడియోలు తీయాలని మల్లితో చెప్పుకుంటాడు. ఫోన్‌లోనే చిన్న చిన్న వీడియోలు తీయడం ప్రారంభిస్తారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం వల్ల కలలు పరిమితమవుతాయనే భావన. అయితే ఊర్లో కొందరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అని తెలుసుకున్న ముత్తయ్య కూడా ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని నిర్ణయిస్తాడు.
దానికి లక్ష రూపాయలు అవసరమని చెబుతారు.
Details
ఎమోషనల్ టచ్‌తో
ఏదైనా కోరిక ఉంటే వెంటనే తీర్చుకోవాలి, లేకపోతే అంతా వ్యర్థం అంటూ ముత్తయ్య భావోద్వేగంతో మాట్లాడే సన్నివేశం ట్రైలర్‌లో హైలైట్.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన కలను నిజం చేసుకోవాలనే పట్టుదలతో ముత్తయ్య ముందుకు సాగుతాడు.
ట్రైలర్ చివర్లో "ఆకుచాటు పిందె తడిచే" అంటూ పాట పాడుతూ వీడియో తీసే సీన్ హృదయాన్ని తాకుతుంది.
స్ట్రీమింగ్ తేదీ
'ముత్తయ్య' చిత్రం మే 1న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అధికారికంగా ఈ డేట్‌ను ప్రకటించారు. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీగా మంచి స్పందన దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
Details
ఫెస్టివల్ గ్లోరీ
'ముత్తయ్య' 2022లోనే రూపొందించారు. కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. భారతీయ భాషల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
ఇండిక్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో కూడా అవార్డు దక్కించుకుంది. యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా పలు అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం మే 1 నుంచి ఈటీవీ విన్‌లో అందుబాటులోకి రానుంది.