రాజమౌళి మహాభారతంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ: ఎప్పుడు మొదలవుతుందంటే?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచానికి తెలుగు సినిమాను పరిచయం చేయడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా, అడ్వెంచరస్ గా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ మాదిరి సినిమాను తెలుగు తెరపై చూపించి ఎంటర్ టైన్ చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తీయడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎవ్వరికీ తెలియదు. అదలా ఉంచితే, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతంపై తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
మహేష్ తో సినిమా తర్వాత మహాభారతం మొదలు
మహాభారతం సినిమాను రాజమౌళి ఎప్పుడు తెరకెక్కించనున్నాడో ఆయన తండి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడి చేసారు. మహేష్ బాబుతో రూపొందే సినిమా పూర్తి కాగానే మహాభారతం మొదలవుతుందని ఒకానొక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ తెలియజేసారు. దీంతో రాజమౌళి ఫ్యాన్స్ లో హుషారు వచ్చేసింది. ఒకవేళ మహాభారతం కథను సినిమాగా తెరకెక్కిస్తే అది కనీసం 10భాగాలుగా ఉంటుందని గతంలో రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. మరి రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో నటులుగా ఎవరెవరు చేయనున్నారనేది చూడాలి. అదలా ఉంచితే, ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళితో సినిమా మొదలు పెడతారని అంటున్నారు.