హృదయాలకు హత్తుకునేలా క్లీం కార ఫస్ట్ వీడియో
రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈరోజుతో పాప పుట్టి నెల రోజులు గడిచింది. ఈ నేపథ్యంలో స్పెషల్ వీడియోను రామ్ చరణ్ షేర్ చేసారు. ఈ వీడియోలో 2012లో రామ్ చరణ్, ఉపాసన పెళ్ళి, ఆ తర్వాత పిల్లల కోసం వెయిటింగ్ మొదలగు విషయాలను వాళ్ళ మాటల్లో చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, ఉపాసన తల్లిదండ్రులు శోభా కామినేని, అనిల్ కామినేని ఉన్నారు. డెలివరీ సమయంలో తాను చాలా టెన్షన్ పడినట్లు, అంతా మంచే జరగాలని ప్రార్థించినట్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. డెలివరీకి వెళ్లే సమయంలో, ఉపాసన భయపడటం, పక్కనున్నవాళ్ళు ఏమీ కాదని ధైర్యం చెప్పడం చూపించారు.
పాప పేరు ముందు ట్యాగ్స్ వద్దు అంటున్న ఉపాసన
పాప పుట్టిన తర్వాత పాపను బయటకు ఎత్తుకురావడం, ఆ సమయంలో స్వీట్స్ పంచుకోవడం, అందరిలోనూ సంతోషం, ఆనంద భాష్పాలు అన్నీ చూపించారు. పాపపై రామ్ చరణ్ అభిమానులు, మీడియా, ఇంకా అందరూ ఎంతో ప్రేమ చూపించారని, అందుకు ఆనందంగా ఉందని ఉపాసన చెప్పుకొచ్చారు. అయితే పాప పేరు ముందు ఎలాంటి ట్యాగ్స్ పెట్టవద్దని ఉపాసన రిక్వెస్ట్ చేసింది. ట్యాగ్స్ అనేవి తమకు తామే సంపాదించుకోవాలనీ, అలా అని దానికోసం ఒత్తిడి ఉండకూడదనీ, హార్డ్ వర్క్ ఉండాలని ఉపాసన అన్నారు. ఇక చివరగా, పాప బారసాల షాట్ లో క్లీం కార అనే పేరును చిరంజీవి పెట్టడాన్ని గమనించవచ్చు. మొత్తానికి ఈ వీడియో ఆద్యంతం హృదయానికి హత్తుకునేలా ఉంది.