Ramayana UK Box Office: యూకే, ఐర్లాండ్‌లో రామాయణ హవా...హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సినిమా సత్తా మరోసారి అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మార్మోగింది. 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' యూకే, ఐర్లాండ్‌లో తొలి వారాంతంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. నవంబర్ 6 నుంచి 8 వరకు కేవలం మూడు రోజుల్లో 2.14 మిలియన్ పౌండ్ల వసూళ్లు సాధించి, అక్కడి బాక్సాఫీస్ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. హాలీవుడ్ సినిమాలతో పాటు జపాన్ చిత్రం 'గాడ్జిల్లా మైనస్ జీరో'ను కూడా వెనక్కి నెట్టడం విశేషం.
Details
361 థియేటర్లలో భారీ స్పందన
బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (BFI) వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ 361 థియేటర్లలో విడుదల చేసింది.
ఒక్కో థియేటర్ నుంచి సగటున 5,951 పౌండ్ల వసూళ్లు వచ్చాయి. ప్రివ్యూ ప్రదర్శనల ద్వారా కూడా సినిమా మంచి ఆదాయాన్ని రాబట్టింది.
337 ప్రాంతాల్లో నిర్వహించిన ప్రివ్యూలతో మరో 4,35,875 పౌండ్లు సమకూరాయి.
దీంతో విదేశీ ప్రేక్షకుల్లోనూ భారతీయ ఇతిహాస కథకు ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది.
Details
'ఆర్ఆర్ఆర్', 'పఠాన్'ను దాటేసి
ఇప్పటివరకు యూకే, ఐర్లాండ్ బాక్సాఫీస్‌లో భారతీయ సినిమాలు రెండో స్థానానికే పరిమితమయ్యాయి.
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్', షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్', 'జవాన్', 'ధురంధర్: ది రివెంజ్' వంటి చిత్రాలు ఆ ఘనత సాధించాయి.
ఇప్పుడు 'రామాయణ' వాటన్నింటినీ అధిగమించి నంబర్ వన్‌గా నిలవడంతో భారతీయ సినిమా మార్కెట్‌కు ఇది మరో ప్రత్యేకమైన విజయంగా మారింది.
Details
హాలీవుడ్ చిత్రాలకు గట్టి పోటీ
'రామాయణ' జోరుతో గతవారం అగ్రస్థానంలో ఉన్న డిస్నీ చిత్రం 'వైల్డ్ హార్స్ నైన్' రెండో స్థానానికి పడిపోయింది.
అది 1.47 మిలియన్ పౌండ్లతో సరిపెట్టుకోగా, 'గాడ్జిల్లా మైనస్ జీరో' 1.39 మిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో నిలిచింది.
అంటే భారతీయ ఇతిహాస కథకు అంతర్జాతీయ మార్కెట్‌లో వస్తున్న స్పందన ఎంత బలంగా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి.
Details
మరిన్ని దేశాల్లోకి 'రామాయణ' ప్రయాణం
నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మించిన ఈ చిత్రం దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
హాంకాంగ్, మెక్సికో, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో విడుదల కొనసాగుతుండగా, నవంబర్ 19న బ్రెజిల్, ఇటలీ, ఉక్రెయిన్, హంగేరీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 20న పోలండ్‌లో, నవంబర్ 26న అర్జెంటీనా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ సహా లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో విడుదల కానుంది.
దీంతో రాబోయే రోజుల్లో 'రామాయణ' అంతర్జాతీయ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.