Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. 'ది అసెంబ్లీ రూమ్స్'తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే విభిన్నమైన సినిమాలకు అండగా నిలుస్తున్న ఆయన.. ఇప్పుడు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద మాల్స్‌లో ఉండే మల్టీప్లెక్స్‌లకు భిన్నంగా.. కాఫీ షాప్‌కు వెళ్లినట్టుగా ప్రేక్షకులు సులభంగా సినిమా చూసేలా చిన్న థియేటర్లను ఏర్పాటు చేయాలని రానా ప్లాన్ చేస్తున్నారు. 'ది అసెంబ్లీ రూమ్స్' పేరుతో ఈ బోటిక్ థియేటర్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమా థియేటర్ అనగానే భారీ స్క్రీన్, వందలాది సీట్లు, మల్టీప్లెక్స్ వాతావరణం గుర్తుకు వస్తుంది. అయితే రానా మాత్రం అందుకు భిన్నమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు.
వివరాలు
పరిమిత సీట్లతో చిన్న స్క్రీన్‌లు ఏర్పాటు..
ప్రేక్షకులు కూర్చునేలా, పరిమిత సీట్లతో చిన్న స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు.
'ది అసెంబ్లీ రూమ్స్'లో ఒక్కో థియేటర్‌లో సుమారు 50 నుంచి 80 సీట్లు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
చిన్న, ప్రశాంతమైన వాతావరణంలో సినిమా చూసే అనుభూతిని ప్రేక్షకులకు అందించడమే ఈ కాన్సెప్ట్ ఉద్దేశంగా తెలుస్తోంది.
ఈప్రాజెక్టులో భాగంగా తొలి థియేటర్‌ను ఊటీలో నిర్మిస్తున్నారు. దీనికి 'ది అసెంబ్లీ రూమ్ జిముటి' అనే పేరు పెట్టారు.
ప్రశాంతమైన వాతావరణానికి పేరుగాంచిన ఊటిలో ఇలాంటి ప్రత్యేకమైన థియేటర్‌ను ఏర్పాటు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
దీంతో పాటు హైదరాబాద్‌లో మరో థియేటర్‌ను నిర్మిస్తున్నట్లు రానా వెల్లడించారు.
బెంగళూరులో కూడా ఒకటి లేదా రెండు థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ఇండిపెండెంట్ సినిమాలకు సరైన థియేట్రికల్ స్పేస్..
ఈ ప్రాజెక్టు వెనుక కేవలం వ్యాపార ప్రయోజనం మాత్రమే లేదని తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రత్యామ్నాయ, ఇండిపెండెంట్ సినిమాలకు సరైన థియేట్రికల్ స్పేస్ కల్పించడమే రానా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
మంచి కంటెంట్‌తో సినిమాలు రూపొందించినప్పటికీ.. భారీ కమర్షియల్ చిత్రాల కారణంగా చిన్న సినిమాలకు తగినన్ని స్క్రీన్‌లు దొరకడం చాలా సందర్భాల్లో సవాలుగా మారుతోంది.
ఇలాంటి సినిమాలకు 'ది అసెంబ్లీ రూమ్స్' ప్రత్యామ్నాయ వేదికగా నిలవాలని రానా భావిస్తున్నారు.
మల్టీప్లెక్స్ అనుభవంలోనూ మార్పు తీసుకురావాలని రానా చూస్తున్నారు.
మాల్‌లో కారు పార్క్ చేసి, వివిధ అంతస్తులు దాటి చివరకు థియేటర్‌కు చేరుకునే విధానానికి బదులుగా.. ప్రేక్షకులు కాఫీ షాప్‌కు వెళ్లినట్టుగా సులభంగా, ప్రశాంతంగా సినిమా చూసే వాతావరణం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
వివరాలు
ఇండిపెండెంట్ సినిమాలకు మరింత ప్రోత్సాహం..
నిర్మాతగా రానా ఇప్పటికే కొత్త దర్శకులు, విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
తన స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా కొత్తవారిని ప్రోత్సహిస్తూ పలు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తున్నారు.
ఇప్పుడు ఇండిపెండెంట్ సినిమాలకు మరింత ప్రోత్సాహం లభించేలా థియేట్రికల్ ఎగ్జిబిషన్‌లోనూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు.
ఊటీలో ప్రారంభమై హైదరాబాద్, బెంగళూరుకు విస్తరించనున్న ఈ బోటిక్ థియేటర్ కాన్సెప్ట్ విజయవంతమైతే.. భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఇలాంటి చిన్న సినిమా స్పేస్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.