రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుగా నటించిన మొదటి ఓటీటీ సీరీస్ రానా నాయుడు కు ప్రేక్షకుల నుండి నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సిరీస్ లో బూతులు మరీ శృతి మించి పోయాయని, శృంగారం ఎక్కువైపోయిందనీ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ పాత్రను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. రానా నాయుడు సిరీస్ కేవలం పెద్దల కోసమే అని చెప్పినా కూడా, వెంకటేష్ ఇలాంటి సిరీస్ లో ఎలా నటించాడంటూ కామెంట్స్ చేసారు. మరి ఈ కామెంట్స్ ని నెట్ ఫ్లిక్స్ సీరియస్ గా తీసుకుందో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, రానా నాయుడు సిరీస్ ని తెలుగు ప్రేక్షకులు చూడకుండా చేసింది.
బూతుల ఎఫెక్టే కారణమంటున్న ప్రేక్షకులు
అంటే తెలుగు ఆడియోని తీసేసారు. దీని ప్రకారం రానా నాయుడు సిరీస్ ని చూడాలనుకుంటే హిందీ, తమిళం, మళయాలం, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనికంతటికీ కారణం బూతుల ప్రభావమే అని మాట్లాడుకుంటున్నారు. ఓటీటీలో అసభ్య కంటెంట్ పెరిగిపోతుందని వస్తున్న వార్తలు, ఓటీటీలోని అసభ్య కంటెంట్ పై కోర్టుల్లో కేసులు.. వీటన్నింటి మధ్య రానా నాయుడు తెలుగు ఆడియోని ఆపేశారని అనుకుంటున్నారు. బూతుల గురించి పక్కన పెడితే, రానా నాయుడు సిరీస్ పై మిశ్రమంగా స్పందించారు. సినిమా సెలెబ్రిటీల అవసరాలు తీర్చే రానా పాత్రకు చిన్నప్పటి నుండి తండ్రి వెంకటేష్ పాత్ర అంటే ఇష్టం ఉండదు. తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణనే ఇందులో చూపించారు.