Ranveer Singh: కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్ సింగ్‌కు స్వల్ప ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
కాంతర చాప్టర్ 1 చిత్రంలోని దైవిక సన్నివేశాన్ని కించపరిచేలా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అనుకరించారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒక న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టు రణ్‌వీర్‌కు స్వల్ప ఊరటనిచ్చింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తూ, అయితే తదుపరి విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించింది. గతేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ 'కాంతార' చిత్రంలో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. ఈ సందర్భంగా 'పంజుర్లి' హావభావాలను వేదికపై ప్రదర్శించారు. అయితే వెంటనే రిషబ్ శెట్టి అలా చేయవద్దని వారించారు.
Details
క్షమాపణ చెప్పినా చల్లారని వివాదం
ఈ ఘటనపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో రణ్‌వీర్ సింగ్ క్షమాపణలు తెలిపారు. రిషబ్ ఎంతో అద్భుతంగా నటించారని చెప్పడానికి మాత్రమే నేను ఆ హావభావాలు ప్రదర్శించాను. ఆ సన్నివేశాలు ఎంత కఠినమో నాకు తెలుసు. అలాంటి క్లిష్ట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించే ఆయనంటే నాకు ఎంతో గౌరవం. మన దేశ సంప్రదాయాలన్నిటిపైనా నాకు గౌరవమే ఉంది. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమించాలని ఆయన అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే క్షమాపణల తర్వాత కూడా వివాదం చల్లారకపోవడంతో విషయం కోర్టుకు చేరింది. న్యాయమూర్తి రణ్‌వీర్ సింగ్‌కు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ, తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు.