Ranveer Singh: 'కాంతార' వివాదం.. చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ సింగ్ ప్రాయశ్చిత్తం
ఈ వార్తాకథనం ఏంటి
'కాంతార' సినిమాలో చూపించిన పవిత్రమైన దైవ సంప్రదాయాన్ని అనుకరిస్తూ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ గతంలో మిమిక్రీ చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం మైసూరులోని ప్రసిద్ధ చాముండేశ్వరి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తన ప్రాయశ్చిత్తాన్ని వ్యక్తం చేశారు.
వివరాలు
అసలేం జరిగిందంటే..
గోవాలో నిర్వహించిన 'ఐఎఫ్ఎఫ్ఐ 2025' ముగింపు కార్యక్రమంలో 'కాంతార' చిత్రం దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. ఆ వేడుకలో రణ్‌వీర్ సింగ్, సినిమాలో ఎంతో పవిత్రంగా భావించే 'దైవ నృత్యం' అయిన భూత కోల ప్రదర్శనను స్టేజ్‌పై అనుకరించారు. అంతేకాకుండా, తుళునాడు ప్రాంత ప్రజలు అత్యంత భక్తితో ఆరాధించే ఆ దైవాలను ఆయన 'దయ్యాలు'గా పేర్కొనడం మరింత వివాదానికి దారితీసింది. దీంతో కన్నడ సంప్రదాయాలు, స్థానిక ఆచారాల పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాలు
ఆలయంలో ప్రత్యేక పూజలు..
ఈ ఘటనపై బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును రద్దు చేయాలంటూ ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో తాను చాముండేశ్వరి దేవిని దర్శించుకుని క్షమాపణలు కోరుతానని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న, నాలుగు వారాల లోపు ఆలయాన్ని సందర్శించాలని రణ్‌వీర్ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు సూచించిన గడువులోనే ఆయన తన ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి మైసూరుకు చేరుకుని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి క్షమాపణలు తెలియజేశారు.
వివరాలు
క్షమాపణలు తెలిపిన రణ్ వీర్ సింగ్..
ఈ వివాదంపై తాజాగా స్పందించిన రణ్‌వీర్ సింగ్, తన ఉద్దేశం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదని స్పష్టం చేశారు. "ఆ సినిమాలో రిషబ్ శెట్టి ప్రదర్శించిన అసాధారణ నటనను ప్రశంసించాలనే ఉద్దేశంతోనే నేను ఆ ప్రదర్శన చేశాను. ఒక నటుడిగా ఆ స్థాయి భావవ్యక్తీకరణకు ఎంతటి కృషి అవసరమో నాకు తెలుసు. ఆయన ప్రతిభ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. దేశంలోని ఏ సంస్కృతి, సంప్రదాయం లేదా విశ్వాసాన్ని అవమానించే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలు లేదా ప్రవర్తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే, వారికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను" అని రణ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు.