Raviteja : ఆగస్టు 21న 'ఇరుముడి' సందడి.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక రస్టిక్ యాక్షన్-ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి'పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో విశేష స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో రవితేజ ఇప్పటివరకు కనిపించని కొత్త అవతారంలో, అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు. తండ్రి-కూతురు అనుబంధానికి సంబంధించిన హృదయాన్ని తాకే భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, అలాగే ఆధ్యాత్మిక అంశాల సమ్మేళనంగా కథ సాగనుంది.
వివరాలు
రవితేజకు జోడీగా తమిళ నటి ప్రియా భవానీ శంకర్..
ఈ సినిమా రవితేజకు బలమైన విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రవితేజకు జోడీగా తమిళ నటి ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
వివరాలు
ఆకట్టుకుంటున్న 'విల్లాలి వీరుడు' పాట..
చిత్రంలో రవితేజ ప్రత్యేకమైన వృద్ధుడి గెటప్‌లో కనిపించే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. అంతేకాకుండా, భక్తి గీతాల అభిమానులను ఆకట్టుకున్న 'విల్లాలి వీరుడు' పాటను కొత్త రూపంలో ఈ చిత్రంలో వినిపించనున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, భక్తి అంశాల సమన్వయంతో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఆశిస్తున్నట్లే ఈ చిత్రం ఆయనకు ఘనమైన కమ్‌బ్యాక్‌గా నిలుస్తుందేమో చూడాలి.