Loading...
Agadha Movie Review: రివ్యూ: 'అగధ'.. భయపెట్టి.. థ్రిల్ చేసిన ఎం.ఎస్‌.రాజు మూవీ ఎలా ఉందంటే?
రివ్యూ: 'అగధ'.. భయపెట్టి.. థ్రిల్ చేసిన ఎం.ఎస్‌.రాజు మూవీ ఎలా ఉందంటే?

Agadha Movie Review: రివ్యూ: 'అగధ'.. భయపెట్టి.. థ్రిల్ చేసిన ఎం.ఎస్‌.రాజు మూవీ ఎలా ఉందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మహాదేవి (కామాక్షి భాస్కర్ల)ను ఆమె బాబాయ్ (భానుచందర్) తన పిల్లలతో పాటు పెంచుతాడు. అనుకోకుండా ఓ రోజు ఆమెకు ఓ దైవిక శక్తి దర్శనమిచ్చి, కొత్త మార్గంలోకి నడిపిస్తుంది. అప్పటి నుంచి ఆ శక్తి సన్నిధిలోనే పెరిగిన మహాదేవికి ఓ సాధువు యంత్ర, తంత్ర విద్యలను నేర్పిస్తాడు. వాటిని ప్రజల మేలు కోసం ఉపయోగించాలని సూచిస్తాడు. అప్పటి నుంచి అతీత శక్తుల బారినపడుతున్న ప్రజలను కాపాడుతూ మహాదేవి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు సంపాదిస్తుంది. అలాంటి మహాదేవిని పెంచిన బాబాయ్ కుటుంబానికి 'అగధ' అనే అతీత శక్తి నుంచి ముప్పు ఎదురవుతుంది. గర్భంతో ఉన్న బాబాయ్ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు మరికొన్ని మరణాలు కూడా సంభవిస్తాయి.

వివరాలు

ఎలా ఉందంటే?

దీంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మహాదేవి సొంతూరికి వెళ్తుంది.

అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? అసలు అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్నే అది ఎందుకు టార్గెట్ చేసింది? దైవిక శక్తుల అండ ఉన్న మహాదేవికి, అగధకు మధ్య పోరాటం ఎలా సాగింది? చివరకు ఎవరు గెలిచారనేదే సినిమా కథ.

ఆత్మల కథలు తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఇలాంటి కథల ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను భయపెట్టడం, థ్రిల్ చేయడమే.

అయితే ఇటీవలి కాలంలో హారర్ కథలకు కామెడీని జోడించి తెరకెక్కించడం ఎక్కువైంది. అందుకు భిన్నంగా చాలా రోజుల తర్వాత కేవలం భయం, ఉత్కంఠను పంచడమే లక్ష్యంగా రూపొందిన చిత్రమే 'అగధ'.

వివరాలు

అలరించిన హర్రర్ సన్నివేశాలు

థ్రిల్లర్‌కు అవసరమైన వేగం కొంత తక్కువగా ఉన్నప్పటికీ.. ఆసక్తికరమైన కథా ప్రపంచం, గాఢతతో కూడిన సన్నివేశాలతో సినిమా చాలావరకు తన లక్ష్యాన్ని చేరుకుంది.

దైవిక శక్తికి, చీకటి శక్తికి మధ్య జరిగే పోరాటాన్ని ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే 'అగధ' చుట్టూ అల్లిన హారర్ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో వచ్చే అనూహ్య మలుపులు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

అడవిలో ఓ యువతిని ఎవరో వెంటాడటం, ఆమెతో ఉన్న స్నేహితుడి హత్య, ఆ తర్వాత యువతి ఆత్మహత్య చేసుకోవడం వంటి సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. పెద్దగా ఆలస్యం చేయకుండా ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది.

ADVERTISEMENT

వివరాలు

విరామానికి ముందు సన్నివేశాలు అద్భుతం

మహాదేవి పాత్ర పరిచయం, ఆమె బాల్యం, దైవిక శక్తితో ఏర్పడిన బంధం, ఆమె నేర్చుకున్న యంత్ర, తాంత్రిక విద్యలు, వాటిని ఉపయోగించే విధానం ఆసక్తిని కలిగిస్తాయి.

మహాదేవి ఇంట్లో వరుసగా వింత మరణాలు చోటుచేసుకోవడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. ఆ మరణాల వెనుక అసలు కారణమేంటో మహాదేవి తనకు తెలిసిన విద్యలను ఉపయోగిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేయడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ క్రమంలో వచ్చే అడవి ఎపిసోడ్, గుహ దగ్గర జరిగే సంఘటనలు భయపెట్టడంతో పాటు థ్రిల్‌ను పంచుతాయి. విరామానికి ముందు వచ్చే తల నరికే సన్నివేశం ప్రేక్షకులకు షాకిస్తుంది.

ఇంటర్వెల్ సీక్వెన్స్ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది.

ADVERTISEMENT

వివరాలు

ఆసక్తికరంగా కథ

అసలు గుహలో ఉన్న అగధ ఎవరు? ఆ రోజు గుహలో ఏం జరిగింది? అనే ప్రశ్నల చుట్టూ ద్వితీయార్ధం సాగుతుంది.

ఇందులో వచ్చే అనూహ్య మలుపులు కథను ఆసక్తికరంగా నడిపిస్తాయి.

ముఖ్యంగా కథానాయకుడి పాత్రలో కనిపించే మరో కోణం, అగధ ఆత్మ పదేపదే ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశించి చేసే హంగామా ఆకట్టుకుంటాయి.

అయితే కథ ఓ దశ దాటిన తర్వాత వరుసగా ఇన్ని మలుపులు అవసరమా? అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో కాలయంత్రం సాయంతో ప్రతినాయకుడిని బంధీగా మార్చే అంశం కొత్తగా అనిపిస్తుంది.

మొత్తంగా చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్ అనుభూతిని అందించడంలో 'అగధ' విజయవంతమైంది.

వివరాలు

ఎవరెలా చేశారంటే?

ఇప్పటివరకు ఎక్కువగా చిన్న పాత్రల్లో కనిపించిన కామాక్షి భాస్కర్ల.. ఈ సినిమాలో మహాదేవిగా ప్రధాన పాత్రను పోషించింది.

పాత్రకు తగ్గ ఆహార్యం, నటన ఆమెకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమా ఆద్యంతం తెరపై కనిపిస్తూ తన పాత్రను భుజాలపై మోశారు.

మహిళా పాత్రలే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉల్కా గుప్తా పోషించిన మహిమ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆమె నటన ఆకట్టుకుంటాయి.

జోవికా విజయ్‌కుమార్ పాత్ర మరో సర్‌ప్రైజ్‌గా నిలుస్తుంది. చాలా సన్నివేశాల్లో ఆమె భయపెట్టారు. ముఖ్యంగా క్లాస్‌రూమ్, చర్చి సన్నివేశాల్లో ఆమె నటన షాకింగ్‌గా ఉంటుంది.

శ్రవణ్‌రెడ్డి భిన్న కోణాల్లో కనిపించే పాత్రను చక్కగా పోషించారు. ఆయన పాత్రకు సంబంధించిన మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి.

వివరాలు

కీలక పాత్ర పోషించిన సంగీతం

భానుచందర్, షిజు, వనిత విజయ్‌కుమార్ తదితరులు సహాయ పాత్రల్లో కనిపించారు. సాంకేతిక విభాగాలు కూడా మంచి పనితీరును కనబరిచాయి.

రాకేశ్ వెంకటాపురం అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని హారర్ వాతావరణాన్ని బలంగా ఎలివేట్ చేసింది.

అగధ రూపం బయటపడే సన్నివేశాలతో పాటు అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ సంగీతం కీలక పాత్ర పోషించింది.

నాని చమిడిశెట్టి కెమెరా పనితనం, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైన్ సినిమా నాణ్యతను పెంచాయి. సీజీ సన్నివేశాల్లోనూ మంచి ప్రమాణాలు కనిపించాయి.

కథకుడిగా కంటే దర్శకుడిగా ఎం.ఎస్. రాజు సినిమాపై తన ప్రభావాన్ని చూపించారు. అతీత శక్తులతో కూడిన కథా నేపథ్యం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథనం మాత్రం పాత పద్ధతుల్లోనే సాగింది.

వివరాలు

బలాలు

కథా నేపథ్యం

మలుపులు, నేపథ్య సంగీతం

అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు

బలహీనతలు

కొంత మందగించిన కథనం

ద్వితీయార్ధంలోని కొన్ని సన్నివేశాలు

చివరిగా..

'అగధ'.. థ్రిల్ పంచుతూ.. భయపెడుతూ..

ADVERTISEMENT