Sushant singh rajput: సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట.. బ్యాంక్ ఖాతాల డీఫ్రీజ్‌కు కోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో సినిమా నటి రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది. ముంబై ప్రత్యేక కోర్టు ఆమెతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తల్లి సంధ్య చక్రవర్తి బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. 2020లో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం నమోదైన డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఈ ఖాతాలను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
కోర్టును ఆశ్రయించిన రియా ఫ్యామిలీ..
ఇప్పటికే కొన్ని ఖాతాలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో ఉన్న మరికొన్ని ఖాతాలను కూడా విడుదల చేయాలని రియా కుటుంబం తాజాగా కోర్టును ఆశ్రయించింది. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68ఎఫ్ ప్రకారం ఎన్‌సీబీ అవసరమైన నిబంధనలు పాటించలేదని, అందువల్ల ఖాతాలను స్తంభింపజేయడం చట్టబద్ధం కాదని వారి తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే, ఈ వాదనలను ఎన్‌సీబీ తరఫు న్యాయవాది ఖండించారు. రియా చక్రవర్తి డ్రగ్ సిండికేట్‌లో చురుకుగా వ్యవహరించిందని, అందుకే సంబంధిత అధికారి ఖాతాలను ఫ్రీజ్ చేశారని తెలిపారు.
వివరాలు
ఆ లోపాన్ని అంగీకరించిన ఎన్సీబీ..
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ప్రత్యేక న్యాయమూర్తి యు.సి. దేశ్‌ముఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68ఎఫ్(2) ప్రకారం ఏదైనా ఆస్తి లేదా బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేసిన 30 రోజుల్లోగా సంబంధిత అధికార సంస్థ నుంచి నిర్ధారణ ఉత్తర్వులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఈ కేసులో ఎన్‌సీబీ ఆ ప్రక్రియను పూర్తి చేయలేదని పేర్కొన్నారు. ఈ లోపాన్ని ఎన్‌సీబీ కూడా అంగీకరించిందని, అందువల్ల ఖాతాలను డీఫ్రీజ్ చేయాలన్న పిటిషన్‌ను అనుమతిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు.