
The Academy: ఆస్కార్‌లో కొత్త కేటగిరీలో అవార్డులు.. RRRకి దక్కిన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సినీ రంగంలో అత్యంత గౌరవనీయమైన అవార్డుగా పేరుగాంచిన ఆస్కార్ మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.
ఇప్పుడు వరకు ఎన్నో విభాగాల్లో అవార్డులు అందజేస్తూ వచ్చిన అకాడమీ, తాజాగా కొత్త కేటగిరీగా 'స్టంట్ డిజైన్'ను కూడా జాబితాలో చేర్చింది.
2027లో విడుదలకానున్న సినిమాలనుంచి ఈ కొత్త విభాగాన్ని పరిగణనలోకి తీసుకుని అవార్డులు అందజేయనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది.
ఈ అంశంపై అకాడమీ ప్రతినిధులు మాట్లాడుతూ.."సినిమా రంగం ఆవిర్భావం నుంచే స్టంట్ డిజైన్ ఒక మౌలిక భాగంగా ఉంది.ఈ కేటగిరీలో ప్రతిభావంతులైన కళాకారులను ప్రత్యేకంగా గుర్తించి గౌరవించడం మాకు గర్వకారణంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ నుంచి మరో గుర్తింపు
ఈకొత్త విభాగాన్ని100వ ఆస్కార్ అవార్డులలో భాగంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు వారు తెలిపారు. దీనిపై సినీ ప్రముఖలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త కేటగిరీకి సంబంధించి ఆస్కార్ అకాడమీ విడుదల చేసిన అధికారిక పోస్టర్‌లో తెలుగు చిత్రపరిశ్రమకు ప్రత్యేక స్థానం లభించింది.
విడుదల చేసిన పోస్టర్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం స్టిల్ ను ఉపయోగించడం విశేషం.హాలీవుడ్ చిత్రాలతో పాటు మన దేశీయ చిత్రం పొందిన ప్రాధాన్యం గర్వించదగ్గ విషయం.
ఆపోస్టర్‌లో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్','ఆర్‌ఆర్‌ఆర్', 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రాల స్టంట్స్‌కు సంబంధించిన దృశ్యాలను కలిపి స్టంట్ డిజైన్ విభాగాన్ని పరిచయం చేశారు.
దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.భారతీయ చిత్రసీమకు ఇది లభించిన అరుదైన గౌరవం అంటూ సామాజికమాధ్యమాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
వివరాలు
మరో కీలక విజయం
ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం, ఇందులోని 'నాటు నాటు' పాట ద్వారా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి విదితమే.
ఇప్పుడు స్టంట్ డిజైన్ విభాగంలో కూడా గుర్తింపు రావడం మరో కీలక విజయంగా భావిస్తున్నారు.