
రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్, సెన్సేషనల్ న్యూస్ తో వచ్చాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కోసం నాటు నాటు పాటను ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్, పాడ్ కాస్టర్ సామ్ ప్రాగాసోతో ముచ్చటిస్తూ తన హాలీవుడ్ ప్రవేశం గురించి చెప్పుకొచ్చాడు.
తన హాలీవుడ్ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని, ఈ విషయమై మరికొద్ది నెలల్లో అధికారిక సమాచారం బయటకు వస్తుందని అన్నాడు రామ్ చరణ్. దీంతో రామ్ చరణ్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
తమ అభిమాన హీరో గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నంతుకు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికల్లో చూపిస్తున్నారు. హాలీవుడ్ లో తనకు ఎవరెవరితో నటించాలనుందనే కోరికను కూడా బయటపెట్టాడు రామ్ చరణ్.
రామ్ చరణ్
టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, జూలియా రాబర్ట్స్ తో నటించాలనుకుంటున్న రామ్ చరణ్
హాలీవుడ్ ఎంట్రీపై అటు అభిమానులే కాదు ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంచితే, హాలీవుడ్ నటులైన టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, జూలియా రాబర్ట్స్ సరసన నటించాలనుందని రామ్ చరణ్ పేర్కొన్నారు.
అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుందని, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ వంటి భేదాలు చెరిగిపోతున్నాయని, సంస్కృతులు మిళితమై కొత్త కథలు పుట్టుకొస్తాయనీ రామ్ చరణ్ చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే, ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదీన ఉండనుంది. ఆల్రెడీ చంద్రబోస్, ఎమ్ఎమ్ కీరవాణి సహా అందరూ అమెరికా చేరుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పక్కా అని అభిమానులు అనుకుంటున్నారు.