సలార్ సినిమాలో కన్నడ స్టార్: అభిమానులకు పూనకాలే?
సలార్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ తరుణంలో సలార్ గురించి వస్తున్న అప్డేట్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సలార్ సినిమాలో జగపతి బాబు, మళయాలీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్లు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా సలార్ కోసం మరో స్టార్ హీరో వస్తున్నారని తెలుస్తోంది. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, సలార్ లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారిక సమచారం రాలేదు కానీ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ చివరి దశలో ఉన్న సలార్ షూటింగ్ లో రక్షిత్ శెట్టి పాల్గొంటారని అంటున్నారు.
కన్నడ ప్రేక్షకుల్లో పెరిగే అంచనాలు
చార్లీ 777 తెలుగు అనువాదం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్ శెట్టి పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి సలార్ కు మరింత మైలేజ్ వస్తుందని అంటున్నారు. అంతేకాదు, సలార్ లో రక్షిత్ శెట్టి కనిపిస్తే కన్నడ ప్రేక్షకులకు సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉండనుందని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందుతున్న సలార్ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా టీజర్, జులై 7వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 28వ తేదీన సలార్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.