Samantha: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకూ.. సమంత సెన్సేషనల్ జర్నీ
ఈ వార్తాకథనం ఏంటి
'ఏ మాయ చేసావె' సినిమాలో అమాయకమైన చూపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జెస్సీ పాత్రను ఎవరు మరచిపోగలరు? అలాగే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో ఆవేశభరితమైన నటనతో, యాక్షన్ సన్నివేశాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పదహారేళ్ల క్రితం 'జెస్సీ'గా సినీప్రపంచంలో అడుగుపెట్టిన సమంత.. ఈరోజు పాన్-ఇండియా స్థాయిలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న స్టార్‌గా నిలిచింది. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా కెరీర్‌లో ఆమె పోషించిన కొన్ని చిరస్మరణీయ పాత్రలను ఓసారి గుర్తుచేసుకుందాం.
వివరాలు
జెస్సీగా కుర్రాళ్ల మదిలో నిలిచిన సామ్
'ఏ మాయ చేసావె' సినిమాలో జెస్సీ పాత్రతో సమంత యువత మనసులను గెలుచుకుంది. చీరకట్టులో, తక్కువ మేకప్‌తో ఎంతో సహజంగా కనిపిస్తూ సాధారణ అమ్మాయిలా తెరపై మెరిసింది. ఆ సినిమాలో ఆమె చూపించిన పరిపక్వత, కళ్లతో వ్యక్తపరిచిన భావాలు టాలీవుడ్‌కు ఓ కొత్త స్టార్ హీరోయిన్ వచ్చిందనే సంకేతాలు ఇచ్చాయి. సమంత కెరీర్‌లో జెస్సీ పాత్ర ఎప్పటికీ ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
వివరాలు
అగ్రహీరోల సరసన వరుస సినిమాలు..
తెలుగులో తొలి సినిమా ఘనవిజయం సాధించడంతో సమంతకు అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు వచ్చాయి. 'దూకుడు', 'ఈగ', 'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. 2012 నుంచి 2017 వరకు వరుస విజయాలతో ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను, మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకుంది. ఆమె స్టైల్, గ్లామర్, చిలిపి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
వివరాలు
డీ గ్లామర్ పాత్రలో మెప్పించిందిలా..
అనేక సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేసినప్పటికీ, ఆమె లోని అసలు నటిని వెలికి తీసింది 'రంగస్థలం'లోని రామలక్ష్మి పాత్రే. 2018లో విడుదలైన ఈ చిత్రంలో డీ-గ్లామర్ పాత్రలో నటించి, మేకప్ లేకుండానే అందరినీ ఆకట్టుకుంది. అదే ఏడాది 'మహానటి'లో మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రలో నటించి తనలోని మరో కోణాన్ని చూపించింది.
వివరాలు
ఆ పాత్రలు స్వీకరించడం పెద్ద సవాల్..
ఇక సమంత కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'మజిలీ' ఒకటి. ఇందులో శ్రావణి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 'ఓ బేబీ' సినిమాలో వృద్ధురాలు యువతిగా మారితే ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించి తన ప్రతిభను మరోసారి నిరూపించింది. కెరీర్ శిఖరాగ్రంలో ఉన్న సమయంలో 'సూపర్ డీలక్స్'లో వేంబు పాత్రలో బోల్డ్, నెగెటివ్ షేడ్స్ ఉన్న సవాల్‌తో కూడిన పాత్రను స్వీకరించడం ఆమె ధైర్యాన్ని చూపించింది.
వివరాలు
మా ఇంటి బంగారం అంటూ వస్తున్న సమంత..
సమంత ప్రయాణంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీ పాత్ర కీలక మలుపుగా నిలిచింది. గ్లామర్‌కు దూరంగా, గంభీరమైన పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. మరోవైపు 'పుష్ప'లో 'ఊ అంటావా' పాటతో మాస్ సెన్సేషన్ సృష్టించింది. అలాగే 'యశోద', 'శాకుంతలం' వంటి ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో కథానాయికగా బాధ్యతను భుజాన వేసుకుంది. ఈ తరహా విభిన్న ప్రయాణం సమంతకే సాధ్యమైంది. ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాట మంచి స్పందన తెచ్చుకోగా, సినిమా మే 15న విడుదల కానుంది.