Allu Arjun: సంధ్య థియేటర్ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్..!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫున కోర్టును కోరినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 18 మంది మాత్రం న్యాయస్థానం ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారు విచారణ ప్రక్రియలో పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతంలో ఉన్న సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
వివరాలు
మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్
ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. అనంతరం మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. దర్యాప్తు పూర్తయ్యాక ఈ కేసులోని 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం జరిగిన విచారణకు అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులందరూ హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.