శాకుంతలం సినిమా ఫలితం బాధపెట్టింది అంటున్న నటి
సమంత ప్రధాన పాత్రలో రూపొందిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమంత కెరీర్లోనే అతిపెద్ద అపజయంగా నిలిచింది శాకుంతలం. త్రీడీలో రూపొందిన ఈ సినిమాను కనీస కలెక్షన్లు కూడా రాలేదని సమాచారం. తాజాగా ఈ సినిమా పలితంపై బాధపడ్డానని చెబుతున్నారు మధుబాల. శాకుంతలం సినిమాలో మేనక పాత్రలో కనిపించిన మధుబాల, శాకుంతలం సినిమా సక్సెస్ కాకపోవడంతో బాధపడినట్లు చెప్పుకొచ్చారు. శాకుంతలం సినిమా కోసం చిత్రబృందం అంతా ఎంతగానో శ్రమించారనీ, ప్రీ ప్రొడక్షన పనుల నుండీ మొదలుకుని సినిమా రిలీజ్ అయ్యేవరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని ఆమె అన్నారు. గ్రాపిక్స్ పనుల కోసమే ఏకంగా సంవత్సరం కేటాయించారనీ ఆమె అన్నారు.
బాహుబలి గురించి ఎవ్వరూ ఊహించలేదు
శాకుంతలం చిత్రీకరణ సమయంలో టెక్నీషియన్లను గానీ, నటులను గానీ చిత్రబృందం ఒత్తిడి గురి చేయలేదని, కావాల్సినంత స్వేఛ్ఛను ఇచ్చారని అన్నారు మధుబాల. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి మాట్లాడిన మధుబాల, ఆ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించాయని, ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరని, బాహుబలి సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదని ఆమె అన్నారు. సమంత కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రిలీజైన శాకుంతలం, ఇతర భాషల్లోనూ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. 50కోట్ల బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం, మొదటి వారాంతంలో కనీసం 10కోట్ల వసూళ్ళు కూడా చేయలేకపోయింది.