శివ కార్తికేయన్ మహావీరుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది: స్ట్రీమింగ్ ఎప్పటి నుండంటే?
తమిళంలో వరుసగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్, తెలుగు మార్కెట్ మీద చాలా ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన నటించిన మహావీరుడు చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ అంశాలు కలిగిన పక్కా కమర్షియల్ సినిమా అయిన మహావీరుడు చిత్రం, తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ సినిమా, ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 11వ తేదీ నుండి తెలుగు, తమిళంలో అందుబాటులో ఉండనుంది. దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రాన్ని మడోన్నా అశ్విన్ డైరెక్ట్ చేసారు.
మహావీరుడు కథ ఏంటంటే?
తన తల్లి, చెల్లితో కలిసి ఒక బస్తీలో నివసించే సత్య(శివ కార్తికేయన్), కార్టూనిస్ట్ గా ఒకానొక పత్రికలో పనిచేస్తుంటాడు. సత్య చాలా పిరికివాడు. సమాజంలో ప్రతీదానికీ సర్దుకు పోతుంటాడు. అయితే ఒకానొక టైమ్ లో ప్రభుత్వం కట్టించిన ప్రజాభవనంలోకి బస్తీ వాసులు అందరితో కలిసి సత్య వెళ్ళిపోతాడు. ఆ భవనం చాలా నాసిరకంగా ఉంటుంది. కిటికీల తలుపులు ఊడిపోతుంటాయి. ఈ విషయం మీద కూడా అతను సర్దుకుపోతాడు. సడెన్ గా అతను రాసిన కార్టూన్లలోంచి కొన్ని మాటలు పై నుండి వినిపిస్తూ ఉంటాయి. అసలు ఆ మాటలు ఎవరివి? ప్రజా భవనాన్ని నాసిరకంగా నిర్మించిన వారిపై సత్య ఎలా పోరాడాడు అనేదే కథ.