Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయ్యా.. దేవుడిలా ఆరాధించారు : ప్రియాంక చోప్రా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా సినీ రంగప్రవేశం చేసిన తొలి హీరో తమిళ నటుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కావడం విశేషం. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, ఆయన గురించి గతంలో ప్రియాంక చెప్పిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2002లో విడుదలైన 'తమిజన్' సినిమాతో ప్రియాంక చోప్రా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో తనకు తమిళ భాష అసలు రాదని, డైలాగులను కాగితంపై రాసుకుని బట్టీ పట్టి చెప్పేదాన్నని వెల్లడించారు.
వివరాలు
ఆ గౌరవాన్ని చూసి ఆశ్చర్యపోయా
సినిమాల షూటింగ్ ఎలా జరుగుతుందో, తెర వెనక పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా అప్పటివరకు తెలియదని చెప్పారు. థియేటర్లలో సినిమాలు చూడడమే తనకు తెలిసిన అనుభవమని పేర్కొన్నారు. అయితే 'తమిళన్' షూటింగ్ సమయంలో విజయ్‌కు ఉన్న అపారమైన అభిమాన గణాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రియాంక తెలిపారు. షూటింగ్ స్పాట్‌కు వందలాది అభిమానులు తరలివచ్చేవారని, సెట్స్‌లోకి రావడానికి కూడా పోటీ పడేవారని గుర్తుచేసుకున్నారు. విజయ్ డ్యాన్స్ చేస్తున్నా, డైలాగులు చెబుతున్నా అభిమానులు కదలకుండా ఆయననే చూస్తూ ఉండేవారని చెప్పారు. అంతటి క్రేజ్‌ను చూసి తాను షాక్‌కు గురయ్యానని, ప్రజలు విజయ్‌ను దేవుడిలా ఆరాధిస్తున్నారనే భావన కలిగిందని ప్రియాంక వ్యాఖ్యానించారు.
వివరాలు
ఎంతో గౌరవంగా చూసుకున్నారు
ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కూడా విజయ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. షూటింగ్ సమయంలో విజయ్ ప్రియాంకను ఎంతో గౌరవంగా చూసుకునేవారని తెలిపారు. విజయ్‌తో సమానంగా డ్యాన్స్ చేయడంలో మొదట ప్రియాంకకు ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ ఆమె పట్టుదలతో సాధన చేసి తన ప్రతిభను నిరూపించుకుందని చెప్పారు. అలాగే 'తమిళన్' సినిమా అనుభవమే ప్రియాంకను నటనను పూర్తి స్థాయి కెరీర్‌గా ఎంచుకునేలా ప్రేరేపించిందని వెల్లడించారు. 2002లో విడుదలైన 'తమిళన్' సినిమా ప్రియాంక చోప్రాకే కాకుండా దర్శకుడు మజీత్ కు కూడా తొలి చిత్రం కావడం విశేషం. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది.