Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. వెలుగులోకి సంచలన విషయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో మరోసారి 'అండర్ వరల్డ్ భయం' చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత పరిశ్రమలో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో తాజాగా ప్రఖ్యాత దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల కాల్పుల ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. సంఘటన వెలుగులోకి వచ్చిన కొద్ది గంటలలోనే, ఈ ఘటనలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు గ్యాంగ్‌స్టర్ శుభం లోంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో రోహిత్ శెట్టిని మాత్రమే కాకుండా మొత్తం బాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం పరిశ్రమలో భయాన్ని సృష్టించింది.
Details
ఈసారి బుల్లెట్ ఛాతీని తాకుతుంది
తదుపరి బుల్లెట్ ఇంటిని కాదు... ఛాతీని తాకుతుంది. రోహిత్ శెట్టి ఇంట్లో జరిగిన కాల్పులకు మేమే బాధ్యత వహిస్తున్నాం. ఎన్నిసార్లు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా వినకపోతే, తదుపరి బుల్లెట్ నేరుగా ఛాతీలోకి దూసుకుపోతుంది. బాలీవుడ్ మారకపోతే బాబా సిద్ధిఖీ కంటే దారుణ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పోస్టులో ఉంది. ఈ వ్యాఖ్యలు సినీ ప్రముఖుల భద్రతపై మళ్లీ చర్చలకు, భయానికి కారణమవుతున్నాయి. పోలీసుల దృష్టిలో శుభం లోంకర్ ప్రస్తుతం ముంబై పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అకోలా జిల్లా వాసి ఈ గ్యాంగ్‌స్టర్ గత కొన్ని సంవత్సరాలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Details
బాబా సిద్ధిఖీ హత్య కేసులో అతని పాత్ర
బాబా సిద్ధిఖీ హత్య కేసులో కూడా అతని పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిపిన వారికి ఆయుధాలు సమకూర్చడం, వారిని లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో అనుసంధానం చేయడంలో శుభం లోంకర్ కీలకంగా వ్యవహరించాడు. అతను సాధారణ నేరస్థుడే కాదు, గ్యాంగ్‌కు టెక్నికల్, సోషల్ మీడియా మేనేజర్ స్థాయిలో వ్యవహరిస్తున్నాడని కూడా సమాచారం ఉంది.