సార్ మూవీ: హృతిక్ రోషన్ సూపర్ 30తో పోలికపై దర్శకుడు క్లారిటీ
తమిళ హీరో ధనుష్ నటించిన తెలుగు చిత్రం సార్, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని చోట్ల నుండి సార్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ చెప్పినట్టు, ఈ సింపుల్ మూవీ ప్రేక్షకులకు సింపుల్ గా నచ్చేసింది. దాంతో సార్ సినిమాకు కలెక్షన్లు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరికి అభినందనలు అందుతున్నాయి. ఐతే అదే టైమ్ లో దర్శకుడిని కొందరు ప్రశ్నిస్తున్నారు. సార్ సినిమాకూ, బాలీవుడ్ లో వచ్చిన సూపర్ 30 సినిమాకు పోలికలు పెడుతున్నారు. హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30లాగే, సార్ కూడా ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించారు.
సూపర్ 30 రాకముందే కథ రాసానంటున్న వెంకీ
సూపర్ 30 సినిమాతో సార్ సినిమాను చాలామంది పోలుస్తున్నారు. అయితే సూపర్ 30 సినిమా రాకముందే సార్ సినిమా కథ రాసుకున్నాననీ, సూపర్ 30 ఒక బయోపిక్ అనీ, సార్ కథ తను రాసుకున్న కల్పిత కథ అనీ చెప్పుకొచ్చారు. ఇంకా, విద్యావ్యవస్థ మీద సినిమా తీయాలని ఎప్పుడో అనుకున్నట్లు, ఆ తర్వాత సూపర్ 30 సినిమా వచ్చినట్లు, ఆ సినిమా చూసాక, తను అనుకున్న పాయింట్ తో సూపర్ 30కి సంబంధం లేకపోవడంతో సార్ సినిమాను తెరకెక్కించినట్లు చెప్పాడు వెంకీ. ఇదిలా ఉంటే, సాధారణంగా ఒక ప్రత్యేక జోనర్ లో వచ్చే సినిమాలు తక్కువగా ఉంటాయి. అలాంటి జోనర్ లో వచ్చే సినిమాలకు పోలికలు ఎప్పుడూ ఉంటాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.