Palash Muchhal: స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్ కేసు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్‌పై తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద నుంచి రూ.40 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాకు చెందిన వైభవ్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. వైభవ్ మానే స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు కాగా, వృత్తిరీత్యా సినీ ఫైనాన్షియర్. సాంగ్లీకి వచ్చిన సందర్భంలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ద్వారా పలాశ్ ముచ్చల్‌కు పరిచయమయ్యారని వైభవ్ పేర్కొన్నారు.
Details
నంబర్ ను బ్లాక్ చేశారు
ఈ పరిచయం అనంతరం పలాశ్ తన దర్శకత్వంలో 'నజరియా' అనే సినిమా తెరకెక్కిస్తున్నానని, పెట్టుబడి పెడితే ఓటీటీలో విడుదల చేసి త్వరగా లాభాలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. పలాశ్ మాటలను నమ్మిన వైభవ్ మానే.. సినిమా నిర్మాణం కోసం రూ.40 లక్షలను పలు దశల్లో నగదు, గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల వివరాలు, ఆధార పత్రాలను కూడా పోలీసులకు సమర్పించారు. అయితే, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని, తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే మొదట హామీ ఇచ్చిన పలాశ్.. ఆ తర్వాత ఫోన్ కాల్స్‌కు స్పందించక, చివరకు తన నంబర్‌ను బ్లాక్ చేశారని వైభవ్ ఆరోపించారు.
Details
దర్యాప్తు కొనసాగుతోంది
నెలల తరబడి ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించానని బాధితుడు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, గతంలో క్రికెటర్ స్మృతి మంధానతో పలాశ్ ముచ్చల్ పెళ్లి నిశ్చయమై, ఆ తర్వాత అది రద్దైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలాశ్ ముచ్చల్ నటుడు శ్రేయాస్ తల్పడేతో తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.