Loading...
Itllu Arjuna Review: ఇట్లు అర్జున.. కొత్త కుర్రాడు మెప్పించాడా? థ్రిల్ పంచాడా?
ఇట్లు అర్జున.. కొత్త కుర్రాడు మెప్పించాడా? థ్రిల్ పంచాడా?

Itllu Arjuna Review: ఇట్లు అర్జున.. కొత్త కుర్రాడు మెప్పించాడా? థ్రిల్ పంచాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో అనీష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఇట్లు అర్జున'. విడుదలకు ముందే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, అఖిల్ వంటి ప్రముఖ తారలు ప్రచార కార్యక్రమాల్లో భాగం కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ చిత్రాన్ని సమర్పించగా.. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించారు. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించారు. మరి భారీ ప్రచారం మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? కొత్త హీరో అనీష్ తన నటనతో మెప్పించాడా? కథ, కథనం ఎలా ఉన్నాయో మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

వివరాలు

కథేంటంటే?

అర్జున్ (అనీష్) మాటలు రాని తెలివైన యువకుడు. చిన్నప్పటి నుంచే దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కుతాడు. తన ఇంటిపైనే ఉండే కీర్తి (అనస్వర)ను బాల్యం నుంచే ప్రేమిస్తుంటాడు.

ఎప్పటికైనా ఆమెను దగ్గరి నుంచి చూసి, కరచాలనం చేసి, తన మనసులోని ప్రేమను చెప్పాలని ఆశపడుతుంటాడు. మరోవైపు కీర్తికి ఇల్లే ప్రపంచం.

స్వేచ్ఛగా, సంతోషంగా తనకు నచ్చినట్లు జీవించాలని కోరుకుంటుంది. కానీ ఆమె తల్లి పద్ధతి పేరుతో కట్టడి చేస్తుంటుంది. అయితే అనుకోకుండా తల్లి ఢిల్లీకి వెళ్లడంతో కీర్తికి స్వేచ్ఛ లభిస్తుంది.

దీంతో కొత్త ఏడాది వేడుకల కోసం పబ్‌కు వెళుతుంది. అక్కడ తన బావ కిశోర్ (వెన్నెల కిశోర్) కంటపడకుండా ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో అర్జున్‌ను కలుస్తుంది.

వివరాలు

వెయ్యి కోట్ల హవాల డబ్బుతో ముడిపడిన కథ

ఆ తర్వాత ఊహించని విధంగా వీరిద్దరూ రూ.వెయ్యి కోట్ల హవాలా డబ్బుతో ముడిపడిన వ్యవహారంలో చిక్కుకుంటారు.

దీంతో పెద్దన్న (ముఖేష్ రుషి) ముఠాతో పాటు పోలీస్ అధికారి ఇరానీ (ఎలాంగో కుమరవేల్)కు టార్గెట్‌గా మారతారు.

అసలు ఆ డబ్బు వెనుక కథేంటి? అర్జున్, కీర్తి ఈ వ్యవహారంలో ఎందుకు చిక్కుకున్నారు? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అర్జున్ తన ప్రేమను కీర్తికి వ్యక్తం చేశాడా? ఆమె కూడా అతడిని ప్రేమించిందా? అనేది మిగతా కథ.

ADVERTISEMENT

వివరాలు

సినిమా ఎలా ఉందంటే?

సినిమా రంగంలో ఓ కొత్త హీరో పరిచయమవుతున్నాడంటే అతడిలోని ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నం ఎక్కువగా కనిపిస్తుంది.

కథ కంటే కూడా హీరో నటన, డ్యాన్సులు, ఫైట్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అనీష్ విషయంలోనూ దర్శకుడు అలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు.

అతడిలోని సహజమైన నటుడిని, డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లోని ప్రతిభను చూపించేలా పాత్రను తీర్చిదిద్దారు. అయితే వీటన్నింటికంటే ఈ సినిమాలో కనిపించే సాహసోపేతమైన ప్రయత్నం హీరో పాత్రకు మాటలు లేకపోవడం.

తొలి సినిమాతోనే ఓ కొత్త హీరో కోసం ఇలాంటి పాత్రను రూపొందించడం, అనీష్ కూడా దాన్ని నమ్మి ధైర్యంగా నటించడం నిజంగా ప్రత్యేకమే.

ADVERTISEMENT

వివరాలు

ఆసక్తికరంగా సాగే ప్రేమకథ, క్రైమ్ ట్రాక్

చిన్న పొరపాటు జరిగినా సినిమా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ.. హీరో పాత్రలోని ఈ బలహీనతను కథకు తెలివిగా ముడిపెడుతూ సన్నివేశాలను రూపొందించిన తీరు ఆకట్టుకుంటుంది.

తన కొడుకు భవిష్యత్తుకు అడ్డొచ్చే వారి ప్రాణాలు తీసే పెద్దన్న, అతడి ముఠా, రూ.వెయ్యి కోట్ల హవాలా డబ్బు, దానికి సంబంధించిన పెన్‌డ్రైవ్, నెల రోజులు మాత్రమే పనిచేసే పాస్‌వర్డ్.. ఇలా సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఆ తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమకథ మొదలవుతుంది. ఈ రెండు ట్రాక్‌లను దర్శకుడు సమాంతరంగా నడిపించిన విధానం బాగుంది.

ప్రేమకథకు తోడుగా కథానాయకుడు, కథానాయిక వెన్నెల కిశోర్‌తో కలిసి చేసే సందడి సినిమాను వేగంగా ముందుకు తీసుకెళ్తుంది.

వివరాలు

ద్వితీయార్ధంలో అక్కడక్కడా థ్రిల్

ప్రధాన పాత్రల పరిచయం, కథానాయకుడి బాల్యం, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు, కథలోని అనూహ్య మలుపులు, పాటలు ప్రథమార్ధానికి ప్రధాన బలంగా నిలుస్తాయి.

రెండో భాగం కూడా పెన్‌డ్రైవ్, పాస్‌వర్డ్ టైమ్‌లైన్ చుట్టూనే సాగుతుంది. కథాపరంగా ప్రత్యేకమైన మెరుపులు లేకపోయినా కొన్ని మలుపులు థ్రిల్‌ను పంచుతాయి.

ప్రేమకథలో భావోద్వేగాలు కూడా పెరుగుతాయి. పోలీస్ అధికారి ఇరానీ పాత్రతో ముడిపడిన మలుపు, ప్రతినాయకుడి ఇంట్లోకి హీరో ప్రవేశించడం, హీరోయిన్ పాస్‌వర్డ్‌ను కనిపెట్టేలా చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.

హీరో తన ప్రేమను నేరుగా వ్యక్తం చేయకపోయినా.. తాను ప్రేమిస్తున్నది ఎవరినో హీరోయిన్ తెలుసుకునేలా రూపొందించిన పతాక సన్నివేశాలు తెలివైన రచనకు అద్దం పడతాయి.

వివరాలు

ఎవరెలా చేశారంటే?

కథానాయకుడు అనీష్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మాటలు రాని యువకుడి పాత్రలో తన హావభావాలు, భావోద్వేగాలను చక్కగా పలికించాడు.

సునాయాసంగా చేసిన డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాలు అతడి ప్రతిభను చూపిస్తాయి.

కథానాయిక అనస్వర రాజన్ నటన, అందం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలతో నవ్వులు పంచారు.

పెద్దన్నగా ముఖేష్ రుషి, గౌరి పాత్రలో కలైయరసన్, ఇరానీగా ఎలాంగో కుమరవేల్ కీలకంగా కనిపించారు. గెటప్ శ్రీను, రఘుబాబు కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించారు.

వివరాలు

సాంకేతికంగా ఎలా ఉందంటే?

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి.

రాజ మహదేవన్ విజువల్స్ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. వెంకీ కుడుముల నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

దర్శకుడు మహేశ్ ఉప్పల థ్రిల్, యాక్షన్ అంశాలను ప్రేమకథతో మేళవించిన తీరు మెప్పిస్తుంది. మానస శర్మతో కలిసి ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే, మాటలు కూడా ఆకట్టుకుంటాయి.

వివరాలు

బలాలు

కథలోని ఆసక్తికరమైన మలుపులు

అనీష్, అనస్వర జోడీ

తమన్ సంగీతం, నేపథ్య సంగీతం

విజువల్స్, నిర్మాణ విలువలు

బలహీనతలు

ద్వితీయార్ధంలో కొంత భాగం చివరిగా: 'ఇట్లు అర్జున'.. కొత్త కుర్రాడు అనీష్ తన నటనతో మెప్పించాడు.

ఆసక్తికరమైన కథనం, ప్రేమకథ, థ్రిల్ అంశాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ADVERTISEMENT