Sobhita: లైఫ్‌ని మార్చింది అదే.. శోభితా ధూళిపాళ్ల ఎమోషనల్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలకు చెందిన శోభితా ధూళిపాళ్ల, తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటిగా నిలిచారు. మోడలింగ్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ హీరోయిన్‌గా ఎదిగారు. 'గూడాచారి', 'మేజర్', 'పొన్నియన్ సెల్వన్' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆమె, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా అవకాశాలు దక్కించుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించారు. నటనతో పాటు తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వంతో కూడా ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
వివరాలు
అభిమానులతో ముచ్చటించిన శోభిత..
ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన శోభితా, జీవితంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తాను ఎప్పుడూ తన మనసు చెప్పిన దారినే అనుసరిస్తానని ఆమె తెలిపారు. "మనసు చెప్పిన మాటను నమ్మి ముందుకు వెళ్లినప్పుడే నా జీవితంలో ఎన్నో విలువైన అనుభూతులను ఆస్వాదించాను. హృదయం ఒప్పుకోని పనులు చేసినప్పుడు మాత్రం ఎప్పుడూ ఆశించిన ఫలితం రాలేదు" అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాలు
పెళ్లి తర్వాత తొలి తమిళ మూవీ..
జీవితాన్ని ప్రవహించే నదిలో సాగే చిన్న ప్రయాణంలా భావిస్తున్నానని చెప్పిన శోభితా, ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని, ముందుగా మనల్ని మనం గౌరవించుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, ఈ ఏడాది ఆరంభంలో 'చీకటిలో' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె, ప్రస్తుతం తన కొత్త తమిళ చిత్రం 'వెట్టువం' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పెళ్లి అనంతరం శోభిత నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.