
Sonakshi Sinha:' నా అనుమతి లేకుండా ఫొటోలు వాడితే సహించను'.. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనాక్షి సిన్హా
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన వ్యక్తిగత ఫొటోలు అనుమతి లేకుండా కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో కనిపించడంతో నటి సోనాక్షి సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా చిత్రాలను వాడటంపై ప్రశ్నిస్తూ, వెంటనే తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
వివరాలు
ఇలా చేయడం సరైన పద్ధతి కాదు: సోనాక్షి సిన్హా
''నేను తరచూ ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేస్తుంటాను.ఇటీవల కొన్ని బ్రాండెడ్ వెబ్‌సైట్‌లలో నా ఫొటోలు చూసి ఆశ్చర్యపోయాను. నన్ను సంప్రదించకుండా, అనుమతి తీసుకోకుండా లేదా కనీసం రిక్వెస్ట్ చేయకుండానే ఈ చిత్రాలు ఎలా ఉపయోగిస్తారు? ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక నటిగా నేను తరచూ కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తాను. అలా ధరిస్తే వాటి బ్రాండ్ వివరాలు జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. కానీ నేను ఒక డ్రెస్‌కు క్రెడిట్ ఇచ్చానని చెప్పి నా చిత్రాలను మీ వెబ్‌సైట్‌లో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటం సరైంది కాదు. నైతిక బాధ్యతల గురించి ఆలోచించరా? వెంటనే నా ఫొటోలు తొలగించండి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాను'' అని స్పష్టం చేశారు.
వివరాలు
జూన్ 27న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'నికితా రాయ్'
ఇక సినిమాల విషయానికొస్తే, గత సంవత్సరం 'హీరామండీ' వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో ప్రేక్షకులను అలరించిన సోనాక్షి సిన్హా, ఇటీవల 'నికితా రాయ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె అన్న ఖుష్ ఎన్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో అర్జున్ రాంపాల్, పరేశ్ రావల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.