Sonu Sood: సీఎం పదవిని తిరస్కరించిన సోనూసూద్.. ఎందుకంటే?
బాలీవుడ్ నటుడు సోనూసూద్ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. ఆయనకు రాజకీయాల్లో ఉన్నత పదవులను చేపట్టే అవకాశాలు వచ్చినా తానే స్వయంగా వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్లలో ముఖ్యమంత్రి పదవి కూడా ఉందని ఆయన తెలిపారు. అయితే వాటిని తిరస్కరించడానికి ఉన్న కారణాలను వివరించారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న కొందరు తనను సంప్రదించి, సీఎం బాధ్యతలు చేపట్టాలని అవకాశం ఇచ్చారు. కానీ, నేను దాన్ని తిరస్కరించాను. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవి, రాజ్యసభ సభ్యత్వం వంటి ఆఫర్లను కూడా ముందుంచారు.
ప్రజా సేవ చేయడమే ఇష్టం
రాజకీయాల్లో ఉంటే మనం ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం లేకపోతుందని చెప్పారు. అయినా నాకు వాటి పట్ల ఆసక్తి లేదని ఇటీవల ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తే పదవితో పాటు ఇల్లు, భద్రత, ప్రభుత్వ లెటర్‌హెడ్, ఇతర విలాసాలు లభిస్తాయని తనతో చాలామంది చెప్పారు. కానీ తన లక్ష్యం డబ్బు సంపాదించడం లేదా అధికారం పొందడం కాదన్నారు. ప్రజా సేవ చేయడానికే అయితే.. తాను ప్రస్తుతం అదే చేస్తున్నానని చెప్పారు. ఒకవేళ రాజకీయ నాయకుడిగా మారితే.. ఆ పదవికి సంబంధించిన జవాబుదారితనాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆ బాధ్యతల గురించి ఆలోచిస్తే తనకు భయమేస్తుందని సోనూసూద్ తెలిపారు.
అధికారంపై ఆసక్తి లేదు
ప్రజాదరణ పొందిన వారు జీవితంలో పైకి ఎదగడం ప్రారంభిస్తారు. కానీ ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ ఉండదు. అందరూ ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. కానీ మనం ఆ ఎత్తులో ఎంతకాలం ఉంటామనేది ఎంతో ముఖ్యమని సోనుసూద్ వ్యాఖ్యానించారు. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు సోనూసూద్ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఎంతో మందికి సాయమందించారు. రాజకీయాల్లో ఉన్నత పదవులను చేపట్టడంపై స్పందించిన సందర్భంగా ఈ విషయాలను వివరించారు.