Page Loader
శ్రీవిష్ణు నటించిన సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే? 
ఓటీటీలోకి వచ్చేస్తున్న సామజవరగమన

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే: ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 21, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే భారీ విజువల్స్ ఉండాలి, హై బడ్జెట్ మూవీ అయ్యుండాలని ఈ మధ్యకాలంలో చాలామంది అనుకున్నారు. వాళ్ళందరి అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చి బంపర్ హిట్ అందుకున్న చిత్రం సామజవరగమన. థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టాలంటే భారీ బడ్జెట్ అవసరం లేదనీ, కథలో కొత్తదనం, హాయిగా నవ్వించే లక్షణం ఉంటే చాలనీ నిరూపించింది సామజవరగమన. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద 50కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. అటు అమెరికాలో సైతం 1మిలియన్ డాలర్ వసూళ్లు అందుకుని శ్రీ విష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా, ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.

Details

జులై 28 నుండి ఆహాలో సామజవరగమన 

ఆహా వేదికగా ఈ నెల 28వ తేదీ నుండి సామజవరగమన అందుబాటులో ఉంటుందని అహా టీమ్ వెల్లడి చేసింది. ఇప్పటివరకు థియేటర్లలో నవ్వులు పంచిన సామజవరగమన చిత్రం, ఇకపై ఓటీటీలో సందడి చేయనుందన్నమాట. ఈ సినిమాలో శ్రీ విష్ణు, నరేష్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వయసు 60కి చేరువవుతున్న సమయంలో డిగ్రీ పాసవడానికి తంటాలు పడే పాత్రలో నరేష్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. అలాగే తండ్రిని ఎలా పాస్ చేయించాలో తెలియక సతమతమయ్యే పాత్రలో శ్రీ విష్ణు నటన ఆకట్టుకుంటుంది. వివాహ భోజనంబు సినిమాతో దర్శకుడిగా మారిన రామ్ అబ్బరాజు, సామజవరగమన తో మంచి హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని రాజేష్ దండ నిర్మించగా, గోపీసుందర్ సంగీతం అందించారు.