Stree 2:'స్త్రీ 2' సూపర్ రికార్డు.. 600 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి హిందీ సినిమాగా గుర్తింపు
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. 39 రోజుల్లో ఈ సినిమా రూ.604.22 కోట్ల నెట్ వసూళ్లు, రూ.713 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో అధికారికంగా పంచుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్ల రికార్డుల్లో సెప్టెంబర్ 23 నాటికి 'స్త్రీ 2' ఆరో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 'బాహుబలి 2', 'కేజీయఫ్ 2', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కల్కి 2898 ఎడీ', 'జవాన్' చిత్రాల తర్వాత స్థానం దక్కింది. సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లను సాధించే అవకాశం ఉంది.
స్త్రీ 2 విజయంపై శ్రద్ధా కపూర్ స్పందన
'స్త్రీ 2' విజయంపై నటి శ్రద్ధా కపూర్ స్పందించారు. ఈ విజయం మాటల్లో వర్ణించలేనని, పెద్ద స్టార్లు లేకపోయినా, మంచి కథ చెప్పితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని 'స్త్రీ 2' నిరూపించిందని ఆమె పేర్కొంది. 2018లో విడుదలైన 'స్త్రీ' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హారర్ కామెడీగా రూపొందించారు. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. చందేరీ గ్రామంలో వచ్చిన కొత్త సమస్య 'సర్కట'ను ఎలా ఎదుర్కొన్నారన్న ఇతివృత్తంతో 'స్త్రీ 2' మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.