
Tollywood: టాలీవుడ్‌లో సమ్మె సెగ.. షూటింగ్‌లకు గుడ్‌బై!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో కార్మికుల సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ రోజు(సోమవారం) నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. దీని ప్రభావంగా షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ షూటింగ్స్‌కు హాజరుకాలేమని స్పష్టంగా తెలిపింది ఫెడరేషన్. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. ఫెడరేషన్ ఏకపక్షంగా 30 శాతం వేతన పెంపు డిమాండ్ చేస్తోందని పేర్కొంటూ, నైపుణ్యం ఉన్నవారికే కాదు, సాధారణ వర్కర్లకూ ఇప్పటికే చట్టంలో పేర్కొన్న కనీస వేతనాలకు మించి చెల్లిస్తున్నామని వివరించింది. ఇక సమ్మె వల్ల నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Details
నిబంధనలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించిన చాంబర్, సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతామన్నారు. అలాగే నిర్మాతలు ఎవరైనా ఫెడరేషన్ లేదా ఇతర సంఘాలతో ఎలాంటి ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా, చాంబర్ జారీచేసే మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని స్పష్టం చేసింది. ఇక ఫెడరేషన్ డిమాండ్లు ప్రకారం, టాలీవుడ్‌లో మూడేళ్లకోసారి 30 శాతం వేతన పెంపు నిబంధన అమల్లో ఉంది. ఈ నిబంధనకు అనుగుణంగా వేతనాలు పెంచాలనే డిమాండ్ పెట్టారు. అంతేకాదు, పెంచిన వేతనాలను ప్రతి రోజూ చెల్లించాల్సిందేనని మరో కీలక షరతు విధించారు.
Details
30శాతం పెంపు చేయాల్సిందే
ఈ రెండు డిమాండ్లను అంగీకరించిన నిర్మాతల సినిమాల్లో మాత్రమే పని చేస్తామన్నారు కార్మికులు. వేతనాల పెంపు అంశంపై ఫెడరేషన్ - నిర్మాతల మండలుల మధ్య కొన్ని రోజులుగా చర్చలు సాగుతున్నప్పటికీ, ఇటీవల జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు కేవలం 5 శాతం మాత్రమే పెంచుతామని మొండిగా పెడుతున్నారని సమాచారం. అయితే ఫెడరేషన్ మాత్రం, వేతన పెంపు గడువు జూన్ 30తో ముగిసిందని.. ఇప్పటికైనా 30 శాతం పెంపు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ, మరో రౌండ్ చర్చలు జరిపే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవాలంటే సమస్యకు త్వరలోనే సానుకూల పరిష్కారం రావాల్సిన అవసరం ఏర్పడింది.