Johnny Master: బాలకృష్ణకు సుమలత క్షమాపణలు.. డ్యాన్సర్స్ యూనియన్ వివాదంలో కీలక మలుపు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదానికి ఎట్టకేలకు ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్‌తో పాటు నందమూరి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యల విషయంలో జానీ మాస్టర్ భార్య సుమలత వెనక్కి తగ్గారు. తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లోని నిర్మాతల మండలి హాల్‌లో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి తదితరులతో కలిసి ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమలత బహిరంగంగా క్షమాపణలు కోరగా.. మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ఐదేళ్ల పాటు సహాయ నిరాకరణ (బ్యాన్) విధిస్తామని ప్రసన్న కుమార్ హెచ్చరించారు.
వివరాలు
తీవ్ర విచార వ్యక్తం చేసిన సుమలత
ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సుమలత.. గతంలో జరిగిన పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మా యూనియన్‌లో జరిగిన అవకతవకలపై మొదలైన వివాదం ఫెడరేషన్‌తో గొడవలకు దారితీసింది.
నాన్ కోఆపరేషన్ అడగటం కోసం ఛాంబర్ మీటింగ్‌కు వచ్చాము. ఆ సమయంలో పల్లి కేశవరావుపై దాడి జరగడం పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారికి సారీ చెబుతున్నాను.
మాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ గొడవలు లేవు" అని స్పష్టం చేశారు. నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. "బాలకృష్ణ గారి లాంటి పెద్దల వల్లే ఇండస్ట్రీ ఇవాళ బాగుంది.
వివరాలు
బాలయ్య బాబుకు కృతజ్ఞతలు
వారి గురించి తప్పుగా మాట్లాడే అర్హత గానీ, ధైర్యం గానీ మాకు లేదు. నేను ఆ మాట అన్నందుకు ఎంతో బాధపడుతున్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకున్నాను. మా వివాదాన్ని పరిష్కరించమని చెప్పిన బాలయ్య బాబుకు కృతజ్ఞతలంటూ సుమలత చేతులెత్తి నమస్కరించారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫెడరేషన్‌తో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ఈ వివాదం వెనుక జరిగిన పరిణామాలపై మాట్లాడారు.
కొందరు తమ వ్యక్తిగత లబ్ధి కోసం సుమలతను రాంగ్ రూట్‌లో ముందుకు తోశారు. దొమ్మి వాతావరణంలో ఛాంబర్ ఈసీ మీటింగ్‌లోకి వచ్చి అనిల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
వివరాలు
వ్యక్తిగతంగా క్షమాపణ లేఖ
దీనిపై ఛాంబర్ సభ్యులు సీరియస్ కావడంతో సమస్య జటిలమైంది.
చివరికి తన తప్పు తెలుసుకున్న సుమలత వ్యక్తిగతంగా క్షమాపణ లేఖలు రాసి ముందుకొచ్చారని తెలిపారు.
ఈ గొడవకు రాజకీయ రంగు పులమొద్దని ఆయన సూచించారు. "ఇది కేవలం జానీ, సుమలత, డ్యాన్సర్స్ యూనియన్ గొడవ మాత్రమే.
దీనికి పవన్ కల్యాణ్, జనసేన, టీడీపీ, వైసీపీలతో ఎలాంటి సంబంధం లేదు. ఇదొక టీ కప్పులో తుఫాన్ లాంటి ఇష్యూ. దీనిని క్లోజ్ చేయమని బాలయ్య బాబు చెప్పడం వల్లే చదలవాడ, నేను ముందుకు వచ్చాము.
ఇకముందు ఛాంబర్‌పై గానీ, సభ్యులపై గానీ దాడులు చేస్తే ఐదేళ్ల పాటు సహాయ నిరాకరణ చేస్తాము" అంటూ ప్రసన్న కుమార్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.