టికెట్ లేకుండా సినిమా చూడొచ్చంటున్న రైటర్ పద్మభూషణ్ టీమ్
సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ, పోయిన శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్. తాజాగా ఈ సినిమా బృందం ఒక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మహిళలు, రైటర్ పద్మభూషణ్ సినిమాను ఫ్రీగా చూడొచ్చని తెలిపింది. అవును, మీరు విన్నది నిజమే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8వ తేదీన మహిళలకు ఫ్రీగా సినిమాను చూపిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 28 థియేటర్లలో సినిమాను ఉచితంగా చూడవచ్చని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాదు ఏ థియేటర్లో ఫ్రీగా చూడవచ్చో సమాచారాన్ని కూడా తెలియజేసారు.
చిన్న సినిమాకు పెద్ద ఆదరణ
రైటర్ పద్మభూషణ్ టీమ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్న వాళ్ళ ఆలోచనలకు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇండియాలోనే కాదు అటు అమెరికాలోనూ రైటర్ పద్మభూషణ్, మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 5.2కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఛాయ్ బిస్కట్ ఫిలిమ్స్ ప్రకటించుకుంది. చిన్న సినిమాకు ఇంతమొత్తంలో కలెక్షన్లు రావడం మంచి పరిణామమని, కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడైనా ఆడతాయని, చిన్నా పెద్దా తేడా అనేది ఏమీ ఉండదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాను షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా చేసింది.